న్యూఢిల్లీ: విధులకు హాజరై కారిడార్‌లో వేచిచూస్తున్న సుప్రీంకోర్టు న్యాయవాదులను శుక్రవారం ఒక దృశ్యం ఆశ్చర్యపరిచింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ దివ్యాంగులైన తన ఇద్దరు కుమార్తెలను కోర్టుకు తీసుకురావడాన్ని న్యాయవాదులు ఆసక్తిగా తిలకించారు. సందర్శకుల గ్యాలరీ నుంచి 10 గంటలకు తన కోర్టు రూమ్‌లోకి ప్రవేశించిన చీఫ్ జస్టిస్ ‘ఇదే నేను కూర్చునే ప్రదేశం’ అంటూ కుమార్తెలకు వివరించారు. అలాగే తన ఛాంబర్‌కు వారిని తీసుకెళ్లిన ఆయన కోర్టు పనితీరు గురించి తెలిపారు. జడ్జీలు ఎక్కడ కూర్చుంటారు, లాయర్లు ఎక్కడ తమ వాదనలు వినిపిస్తారు? తదితర ప్రదేశాలను ఆయన స్వయంగా చూపించి వారికి వివరించినట్టు సుప్రీంకోర్టు వర్గాలు తెలిపాయి.