CJI BR Gavai | సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్‌పై న్యాయవాది రాకేశ్ కిశోర్ షూ విసిరేసేందుకు ప్రయత్నించిన విషయం తెలిసిందే. ఈ ఘటన దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన విషయం తెలిసిందే. ఈ ఘటనపై జస్టిస్ బీఆర్ గవాయ్ తొలిసారిగా స్పందించారు. ఓ కేసు విచారణ సమయంలో ఈ అంశంపై మాట్లాడారు. సోమవారం జరిగిన ఘటనతో తనతో పాటు సహచర న్యాయమూర్తి జస్టిస్ వినోద్ చంద్రన్ షాక్‌కు గురయ్యామన్నారు. అయితే, అది తమ దృష్టిలో ముగిసిన అధ్యాయం మాత్రమేనన్నారు. ఈ విషయంపై మరింత ముందుకు తీసుకెళ్లబోనని వ్యాఖ్యానించారు. బెంచ్‌లో జస్టిస్ ఉజ్జల్ భుయాన్ ఉండగా.. ఈ అంశంపై ఆయన తన అభిప్రాయం వెల్లడించారు. ఈ ఘటనపై తనకు సొంత అభిప్రాయం ఉందని.. దీన్ని ఆషామాషీగా తీసుకునే విషయం కాదన్నారు. జస్టిస్ బీఆర్ గవాయ్ భారత ప్రధాన న్యాయమూర్తి అని.. న్యాయమూర్తులుగా తాము అనేక నిర్ణయాలు తీసుకుంటామని.. అవి ఇతరులు సరైనవిగా భావించకపోవచ్చన్నారు. ఆ కారణంతో తాము తీసుకున్న నిర్ణయాల్లో మార్పు రాదని ఆయన స్పష్టం చేశారు. ఈ సందర్భంగా సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా మాట్లాడుతూ.. న్యాయవాది చర్యలు క్షమించరానివన్నారు. సీజేఐపై ప్రశంసలు కురిపించారు.
సోమవారం సుప్రీంకోర్టులో విచారణ సమయంలో 71 ఏళ్ల న్యాయవాది రాకేశ్ కిశోర్.. చీఫ్ జస్టిస్ గవాయ్ పై షూ విసిరేందుకు ప్రయత్నించారు. ఆయన పోడియం వద్దకు వెళ్లి షూ విసిరేందుకు ప్రయత్నించగా కోర్టులో ఉన్న భద్రతా సిబ్బంది సకాలంలో ఆయనను అడ్డుకున్నారు. ఈ ఘటన నేపథ్యంలో బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా వెంటనే ఆ న్యాయవాది లైసెన్స్‌ను రద్దు చేసింది. అయితే, రాకేశ్ కిశోర్ ఓ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తనకు ఎలాంటి పశ్చాత్తాపం లేదన్నారు. తనతో దేవుడే ఈ పని చేయించాడని చెప్పుకొచ్చాడు. ఇదిలా ఉండగా.. సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ (SCBA) గురువారం రాకేష్ కిశోర్ సభ్యత్వాన్ని తక్షణమే రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. కోర్టు భద్రత, మర్యాదను దృష్టిలో పెట్టుకొని ఘటనను తీవ్రంగా తీసుకున్నట్లు పేర్కొంది. కిశోర్ ప్రవర్తన న్యాయ స్వాతంత్య్రంపై దాడిగా సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ పేర్కొంది. న్యాయ ప్రక్రియను కాపాడేందుకు, వృత్తిపరమైన ప్రవర్తనకు కట్టుబడి ఉండేందుకు ఈ చర్యలు అవసరమని కౌన్సిల్ పేర్కొంది.