న్యూఢిల్లీ, జూలై 9: నిత్యం పెరుగుతున్న నిత్యావసరాల ధరలతో కుదేలవుతున్న సామాన్యుడిపై కేంద్రంలోని మోదీ సర్కార్ నిర్ధాక్షిణ్యంగా వ్యవహరిస్తున్నది. ధరలకు కళ్లెం వేసి పేద, మధ్యతరగతి జీవులకు ఉపశమనం కలిగించేలా ఎటువంటి ప్రయత్నాలు చేయకపోగా మరింతగా ధరల భారం మోపుతూ నడ్డి విరుస్తున్నది. ఓ వైపు పెరిగిన నిత్యావసరాలతో సామాన్యుడి జేబు గుల్లవుతున్నది. ధరల భయంతో కడుపునిండా తినే పరిస్థితి కూడా కనిపించడం లేదు. మరోవైపు కేంద్ర ప్రభుత్వం వంటగ్యాస్ సిలిండర్ ధర మోత మోగిస్తున్నది. ఎల్పీజీ పొగ రహితం అయినప్పటికీ తమ కండ్లలో నీళ్లు తెప్పిస్తున్నదని వినియోగదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ధరలు సామాన్యుడి పాలిట గుదిబండలా మారాయని, తక్కువ వేతన జీవుల పరిస్థితి అగమ్యగోచరంగా ఉన్నదని మోదీ సర్కార్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఇలా అయితే ఎలా బతికేది?
14.2 కేజీల సిలిండర్‌పై ఇటీవలే రూ.50 పెంచారు. హైదరాబాద్‌లో సిలిండర్ ధర రూ. 1,055 నుంచి రూ.1,105కు ఎగబాకింది. ఏడాది వ్యవధిలో గ్యాస్ సిలిండర్‌పై విడతల వారీగా రూ.244 (30 శాతం) వడ్డించినట్లయింది. 14.2 కిలోల వంటగ్యాస్ సిలిండర్‌పై గడిచిన నాలుగు నెలల్లో నాలుగుసార్లు ధర పెంచడం గమనార్హం. గ్యాస్ సిలిండర్ ధర పెరుగుదల ప్రధానంగా డ్రైవర్లు, సెక్యూరిటీ గార్డులు, రోజువారీ కూలీలు, సేల్స్మెన్లు తదితర అల్పాదాయ వర్గాలతో పాటు మధ్యతరగతి ప్రజలకు కూడా తీవ్ర ప్రభావం చూపుతుంది. వారి నెలవారీ జీతం రూ.10 వేల నుంచి రూ.15 వరకు మాత్రమే ఉంటుంది. అటువంటి కుటుంబాలు సిలిండర్‌కే తమ జీతంలో దాదాపు 10 శాతం ఖర్చు చేయాల్సి ఉంటుంది. దీంతో పేద, మధ్యతరగతి ప్రజలు అష్టకష్టాలు పడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఎలా బతికేదని మోదీ సర్కార్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
పెరుగుతున్న గ్యాస్ ధర మోయలేని భారమైంది. పెంచిన ధరలతో మా ఇంటి బడ్జెట్ ఎప్పుడో గాడి తప్పింది.
-కోల్‌కతాకు చెందిన ఉద్యోగి దాస్‌గుప్తా
ఎల్పీజీ ధర పెంపుతో.. నెలవారీ ఖర్చులను కూడా పెరిగాయి. వాటిని తగ్గించుకునేందుకు కిరోసిన్ స్టవ్, కట్టెల పొయ్యి ఆలోచన చేస్తున్నా.
-కోల్‌కతాకి చెందిన గృహిణి స్వప్ప ముఖర్జీ
పెరిగిన సిలిండర్ ధరలతో ఇతర అవసరాలపై ఖర్చులను తగ్గించుకొవాల్సి వస్తుంది. కేంద్రం విధానాలతో సామాన్యుడి కష్టాలు మరింత పెరిగాయి.
-హర్యానాలో స్కూల్ టీచర్ పర్కి మెహ్రా