CISF Suicides | భద్రతా బలగాల ఆత్మహత్యలు 40శాతం తగ్గాయని సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) నివేదించింది. 2023లో 25 మంది సిబ్బంది ఆత్మహత్య చేసుకుంటే.. 2024లో కేవలం 15 మంది మాత్రమే సీఐఎస్ఎఫ్ జవాన్లు పలు కారణాలతో ఆత్మహత్య చేసుకున్నట్లు నివేదికలో పేర్కొంది. గత ఐదేళ్లలో జరిగిన ఆత్మహత్యల గణాంకాలను సెంట్రల్ ఫోర్స్ విడుదల చేసింది. 2024లో లక్ష జనాభాకు 9.87శాతం ఆత్మహత్య కేసులు నమోదయ్యాయి. 2023లో 16.98శాతం రికార్డయ్యాయి.
గత ఐదేళ్లలో మొత్తం ఆత్మహత్య కేసులు, సంవత్సరల వారీగా గణాంకాలను రిలీజ్ చేసింది. 2020లో 18 మంది ఆత్మహత్య చేసుకోగా.. 2021లో 21 మంది, 2022 సంవత్సరంలో 26 మంది.. 2023లో 25 మంది, 2024లో 15 మంది జవాన్లు ఆత్మహత్యకు పాల్పడినట్లుగా తెలిపింది. ఆత్మహత్యలు తగ్గడానికి కారణాలను సైతం పేర్కొంది. ఆత్మహత్యల రేటు గణనీయంగా తగ్గడానికి కారణం సిబ్బంది మానసిక సమస్యల నుంచి బయటపడ్డారన్నారు. బలగాలను మానసిక స్థితిని పరిశీలించి.. ఆరోగ్యంగా ఉండేలా ఓ క్రమపద్ధతిలో చర్యలు తీసుకున్నట్లు సీఐఎస్ఎఫ్ వివరించింది.