Church festival : చర్చి ఫెస్టివల్ (Church Festival) ఏర్పాట్లలో విషాదం చోటుచేసుకుంది. తమిళనాడులోని ఓ చర్చిలో ఉత్సవాల కోసం ఏర్పాట్లు చేస్తుండగా విద్యాదాఘాతంతో నలుగురు యువకులు మృతిచెందారు. తమిళనాడు రాష్ట్రం (Tamil Nadu) కన్యాకుమారి జిల్లా (Kanyakumari District) ఎనాయం పుతేంతురైలోని సెయింట్ ఆంథోనీ చర్చి (Saint Anthony Church) పండుగను ప్రతి ఏటా భక్తులు ఘనంగా నిర్వహిస్తుంటారు. ఈ క్రమంలో ఈ ఏడాది కూడా కార్యక్రమాన్ని భారీగా నిర్వహించాలని ఫాస్టర్లు భావిస్తున్నారు.
ఈ మేరకు ఏర్పాట్లన్నీ చకాచకా పూర్తి చేసేందుకు చర్యలు చేపట్టారు. ఈ పనుల్లో జీసస్ ఫాలోవర్లు, స్థానిక యువత ఉత్సాహంగా పాల్గొన్నారు. పండుగ సందర్భంగా ప్రత్యేకంగా రూపొందించిన రథంపై ఏసుక్రీస్తును ఊరేగిస్తుంటారు. ఈ క్రమంలో రథానికి సుందరీకరణ పనులు చేసేందుకు ఆదివారం కొంతమంది యువకులు సిద్ధమయ్యారు. పనుల కోసం ఇనుప నిచ్చెనను తీసుకెళ్తుండగా అది హైవోల్టేజీ వైర్లకు తగిలింది. దాంతో నలుగురు యువకులు అక్కడికక్కడే మృతిచెందారు. గిలగిలా కొట్టుకుంటూ మంటల్లో కాలుతూ ప్రాణాలు విడిచారు.
కాలిపోతున్న యువకులను స్థానికులు నిశ్చేష్టులై నిలబడ్డారు. మృతులు మైఖేల్ పింటో, మరియా విజయన్, బి శోభన్, ఆంటోనీగా పోలీసులు గుర్తించారు. వారి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. విద్యుదాఘాతానికి సంబంధించిన వీడియోలను కొంతమంది తమ సెల్ ఫోన్లలో రికార్డు చేశారు. ఆ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.