పాట్నా: రసవత్తరమైన బీహార్ రాజకీయాల్లో .. యువ కెరటం చిరాగ్ పాశ్వాన్(Chirag Paswan) ఎన్డీఏ కూటమి విజయంలో కీలక పాత్ర పోషించారు. ఎన్డీఏ కూటమిలో లోక్ జనశక్తి పార్టీ(రామ్ విలాస్) అసాధారణ పోరాటం చేసింది. బీజేపీ, జేడీయూకి ధీటుగా లోక్ జనశక్తి కూడా తన ప్రదర్శన కనబరిచింది. 29 స్థానాల్లో పోటీ చేసిన ఎల్జేపీ.. దాదాపు 22 స్థానాల్లో లీడింగ్‌లో ఉన్నది. తాజా ఫలితాల్లో వస్తున్న ట్రెండ్స్‌తో నితీశ్ కుమార్ మళ్లీ తన సర్కార్‌ను ఏర్పాటు చేయడం ఖాయమవుతోంది. అయితే ప్రధాని మోదీ, సీఎం నితీశ్‌కు సమానంగా బీహార్ రాజకీయాల్లో కొత్త సత్తా చాటారు చిరాగ్ పాశ్వాన్.
గత ఏడాది లోక్‌సభ ఎన్నికల్లోనూ ఆ పార్టీ అయిదు స్థానాల్లో పోటీ చేసి విజయం సాధించింది. 2020 ఎన్నికల్లో 130 స్థానాల్లో పోటీ చేసి కేవలం ఒక్క సీటు మాత్రమే ఎల్జేపీ గెలిచింది. ఓట్ల షేర్ అంశంలో మెరుగైన ప్రదర్శన ఇచ్చినా.. ఆ ఎన్నికల్లో అనేక సీట్లలో జేడీయూ ఓట్లను దెబ్బతీసింది. అయితే తండ్రి రామ్ విలాస్ పాశ్వాన్ తరహాలో చిరాగ్ పాశ్వాన్‌కు చర్మిషా లేదంటూ రాజకీయ నేతలు అభిప్రాయపడ్డారు. 2021లో చిన్న నాన్న పశుపతి కుమార్ పారస్ తో పార్టీలో విబేధాలు తలెత్తడం చిరాగ్ కెరీర్‌కు సమస్యగా మారింది. దళిత ఓట్లను ఆకర్షించే ఉద్దేశంతో చిరాగ్ తన పాచికను వాడారు. కఠినంగా శ్రమించడం వల్ల 2024 లోక్‌సభ ఎన్నికల్లో లోక్‌జనశక్తి అద్భుత విజయాన్ని నమోదు చేసింది. పోటీ చేసిన 5 స్థానాల్లో గెలిచింది.
ఇక తాజా అసెంబ్లీ ఎన్నికల వేళ ముందుగా ప్రశాంత్ కిషోర్‌తో చర్చలు నిర్వహించేందుకు చిరాగ్ పాశ్వాన్ ఆసక్తి చూపారు. కానీ చివరకు ఎన్డీఏ కూటమితో పోరాడి 29 సీట్లల్లో పోటీ చేసేందుకు ఫిక్స్ అయ్యారు. ఒకవేళ ఎన్నికల ఫలితాలు తారుమారైనా.. తాను మాత్రం ఎన్డీఏ కూటమిని వీడేది లేదన్నారు. తనకు ప్రధాని మోదీ అంటే ఇష్టమని చిరాగ్ అన్నారు.
243 స్థానాలు ఉన్న బీహార్‌లో ప్రస్తుతం ఎన్డీఏ కూటమి 194 స్థానాల్లో లీడింగ్‌లో ఉన్నది. ప్రభుత్వ ఏర్పాటుకు 122 సీట్లు కావాలి. ఇక మహాఘట్బంధన్ మాత్రం 43 స్థానాల్లో మాత్రమే ఆధిక్యంలో ఉన్నది. ఎన్డీఏ కూటమిలోని బీజేపీ 89, జేడీయూ 79, ఎల్జేపీ 22 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నాయి. మహాఘట్‌బందన్‌కు చెందిన ఆర్జేడీ 32, కాంగ్రెస్ పార్టీ 4 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నాయి.