Chirag Paswan : కోల్‌కతాలో ఆర్జీ కార్ మెడికల్ కాలేజీ ఆస్పత్రి వైద్యురాలి హత్యాచార కేసు దేశవ్యాప్తంగా కలకలం రేపుతోంది. ఈ ఘటనలో మమతా బెనర్జీ ప్రభుత్వం, అధికార యంత్రాంగం ఘోరంగా విఫలమైందని కేంద్ర మంత్రి చిరాగ్ పాశ్వాన్ ఆరోపించారు. ఘటనా స్ధలంలోకి పెద్దసంఖ్యలో సంఘ విద్రోహ శక్తులు ప్రవేశించి ఆధారాలను మాయం చేసేందుకు ప్రయత్నిస్తున్న తీరు అత్యంత హేయమని అన్నారు.
నిందితులను కాపాడాలని కొందరు కోరుకుంటున్నారని ఈ ఘటనలతో వెల్లడవుతున్నదని చెప్పారు. ఆధారాలు చెరిగిపోకుండా కాపాడాల్సిన బాధ్యత మమతా బెనర్జీ సర్కార్‌పై ఉందని కేంద్ర మంత్రి గుర్తుచేశారు. ఆరోపణలు గుప్పించే బదులు పశ్చిమ బెంగాల్ సీఎం సీబీఐ బృందానికి సహకరించాలని, ఆధారాలు కాపాడేలా చొరవ చూపాలని చిరాగ్ పాశ్వాన్ హితవు పలికారు.
వైద్యురాలిపై హత్యాచార ఘటన పట్ల దేశవ్యాప్తంగా ఆగ్రహం పెల్లుబుకుతున్నదని చెప్పారు. కాగా, వైద్యురాలిపై హత్యాచార ఘటనకు నైతిక బాధ్యత వహిస్తూ పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ రాజీనామా చేయాలని సిలిగురి ఎమ్మెల్యే, రాష్ట్ర అసెంబ్లీ చీఫ్ విప్ డాక్టర్ శంకర్ ఘోష్ డిమాండ్ చేశారు. బెంగాల్లో మహిళలపై లైంగిక దాడులు నిత్యకృత్యమయ్యాయని ఆందోళన వ్యక్తం చేశారు.
కందుని, పార్క్ స్ట్రీట్, మతిగర, చోప్రా, అరియదహ, కలియాగంజ్, హంష్ఖలి సహా పలు ప్రాంతాల్లో ఈ తరహా ఘటనలు ఆందోళన రేకెత్తిస్తున్నాయని మమతా బెనర్జీ ప్రభుత్వాన్ని నడపడంలో విఫలమయ్యారని వెల్లడవుతున్నదని చెప్పారు. ఆర్జీ కార్ ఘటన అనంతరం ఘటనా స్ధలం మీడియా కంటపడకుండా సీఎం ప్రయత్నించారని ఆరోపించారు. మహిళలపై తీవ్ర నేరాలు పెచ్చుమీరుతున్నాయని, దీదీ సర్కార్ హయాంలో మహిళలకు భద్రత కరవైందని వ్యాఖ్యానించారు. నిందితులను పట్టుకున్నా వారిని కఠినంగా శిక్షించడం లేదని ఆరోపించారు.
Read More :