China | న్యూఢిల్లీ: భారత్, చైనా ఉద్రిక్తతలను తగ్గించుకోవడానికి దౌత్య పరమైన ప్రయత్నాలు కొనసాగిస్తుంటే, మరో పక్క పాంగాంగ్ త్సో సరస్సు ఉత్తర తీరానికి దగ్గర్లో చైనా భారీగా నిర్మాణాల్ని చేపట్టింది. ఇండియా టుడే సమీక్షించిన తాజా ఉపగ్రహ చిత్రాల్లో ఈ విషయం వెల్లడైంది. ఈ నిర్మాణాలు భారత్-చైనా దళాల 2020 స్టాండ్ఆఫ్ పాయింట్స్‌కు తూర్పున సుమారుగా 38 కిలోమీటర్ల దూరంలో భారత ప్రాదేశిక భూ భాగానికి అవతలి వైపు ఉన్నాయి.
పాంగాంగ్ సరస్సు భారత్-చైనా పాలిత టిబెట్ మధ్య వివాదాస్పద సరిహద్దుగా ఉన్నది. తక్షశిల ఇన్స్టిట్యూషన్ ప్రొఫెసర్ నిత్యానందం ప్రకారం.. 100కు పైగా భవనాల నిర్మాణం అక్కడ కొనసాగుతున్నది. హెలికాప్టర్ ఆపరేషన్ల కోసం దీర్ఘ చతురస్రాకార స్ట్రిప్‌ను సిద్ధం చేస్తున్నారు. ఎత్తయిన శిఖరాల వెనుక జరుగుతున్న ఈ నిర్మాణాలు వ్యూహాత్మక ప్రయోజనాన్ని కలిగి ఉంటాయని నిత్యానందం విశ్లేషించారు. ఒకవేళ ఆ ప్రాంతాన్ని సైనిక అవసరాల కోసం ఉపయోగిస్తే.. అది చైనా దళాల ప్రతిస్పందన సమయాన్ని తగ్గిస్తుందని భారత మిలటరీ అంచనా వేసింది.