న్యూఢిల్లీ, ఆగస్టు 17 : చైనాలో పరిశోధకులు ప్రెగ్నెన్సీ హ్యూమనాయిడ్ రోబోను అభివృద్ధి చేస్తున్నారు. గర్భాన్ని ధరించడంతోపాటు కృత్రిమ గర్భంలో నవమాసాలు శిశువును మోసి, సురక్షితంగా ప్రసవించడం ఈ రోబో ప్రత్యేకత. ప్రపంచంలో తొలి ‘ప్రెగ్నెన్సీ రోబో’ ఇదే. సింగపూర్‌లోని నన్యాంగ్ టెక్నలాజికల్ యూనివర్సిటీ శాస్త్రవేత్త డాక్టర్ జాంగ్ కిఫెంగ్ నేతృత్వంలో ఈ రోబోను అభివృద్ధి చేస్తున్నట్టు చైనా మీడియా వెల్లడించింది. నెలలు నిండకుండా జన్మించే శిశువుల సంరక్షణ కోసం ప్రస్తుతం ఉపయోగిస్తున్న ఇంక్యుబేటర్ల కంటే ఈ రోబో చాలా భిన్నమైనది. గర్భాన్ని ధరించడం మొదలుకొని శిశువు జననం వరకు మొత్తం గర్భధారణ ప్రక్రియను ఈ రోబో అనుకరిస్తుంది. అంటే గర్భధారణ నుంచి ప్రసవం వరకు శిశువు పూర్తిగా హ్యూమనాయిడ్ రోబోలోని టెక్ గర్భంలో పెరుగుతుంది. ఈ ప్రాజెక్టులో కృత్రిమ గర్భ సాంకేతికత (ఆర్టిఫిషియల్ ఊంబ్ టెక్నాలజీ) ప్రధానమైనది. రోబో బొడ్డులో అమ్నియోటిక్ ద్రవంతో నింపిన కృత్రిమ గర్భం మానవ గర్భాన్ని అనుకరిస్తూ పిండం పెరుగుదలకు అనువైన పరిస్థితిని కల్పిస్తుంది.
సహజంగా జన్మించే శిశువుకు జరాయువు (ప్లాసెంటా) ద్వారా పోషకాలు అందినట్టు ప్రెగ్నెన్సీ రోబోలో కృత్రిమ గర్భానికి జత చేసిన ట్యూబ్ ద్వారా శిశువుకు పోషకాలు అందుతాయి. కృత్రిమ గర్భ సాంకేతికత ఇప్పటికే పరిణితి చెందిన దశలో ఉన్నదని, ఇప్పుడు దీన్ని రోబో ఉదరంలో అమర్చాల్సిన అవసరం ఉన్నదని, తద్వారా నిజమైన వ్యక్తి ఆ రోబోతో ఇంటరాక్ట్ అయి గర్భధారణకు, ఆ గర్భంలో పిండం పెరుగుదలకు వీలు కల్పించాల్సి ఉన్నదని డాక్టర్ జాంగ్ వివరించారు. నిజానికి ఇదేమీ పూర్తిగా కొత్త భావన కాదని, గతంలో కొందరు శాస్త్రవేత్తలు ఓ ‘బయోబ్యాగ్’లో గొర్రెపిల్లను విజయవంతంగా పెంచారని, ఆర్టిఫిషియల్ ఊంబ్ ఆలోచనకు అప్పుడే బీజం పడిందని తెలిపారు. ప్రెగ్నెన్సీ రోబో ప్రొటోటైప్ (నమూనా) వచ్చే ఏడాది చివరి నాటికి సిద్ధమవుతుందని, అందుకు దాదాపు లక్ష యువాన్లు (రూ.12.96 లక్షలు) ఖర్చవుతుందని అంచనా.