న్యూఢిల్లీ, మార్చి 25: తూర్పు లఢక్ నుంచి చైనా బలగాలు వెనక్కి వెళ్లనంత వరకు సరిహద్దుల్లో మళ్లీ సాధారణ పరిస్థితులు ఏర్పడవని చైనాకు భారత్ తేల్చి చెప్పింది. బలగాల ఉపసంహరణను వెంటనే చేపట్టాలని డిమాండ్ చేసింది. ‘భారత్, చైనా సరిహద్దుల్లో మళ్లీ శాంతి నెలకొనాలి’ అని చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ కోరిన నేపథ్యంలో భారత విదేశాంగ మంత్రి జైశంకర్ ఈ మేరకు సమాధానమిచ్చారు. ఇద్దరి మధ్య శుక్రవారం ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్లో ఆకస్మిక భేటీ జరిగింది. సమావేశంపై భారత్, చైనా అధికారికంగా ఎక్కడా ప్రకటించలేదు. ప్రారంభం కావడానికి కొద్ది సేపటి ముందు జైశంకర్ ట్వీట్ ద్వారా వాంగ్ యీ పర్యటనను ధ్రువీకరించారు. 2020లో గల్వాన్ ఘర్షణ తర్వాత రెండు దేశాల మధ్య జరిగిన ఉన్నతస్థాయి సమావేశం ఇదే కావడం విశేషం. ఇరు దేశాల సరిహద్దులతో పాటు, అఫ్గానిస్థాన్, ఉక్రెయిన్ సంక్షోభం తదితర అంశాలపై ఇరు దేశాల విదేశాంగ మంత్రులు మూడు గంటల పాటు చర్చించారు. కరోనా కారణంగా ఇండియాకు వచ్చి ఇక్కడే చిక్కుకుపోయిన భారతీయ విద్యార్థుల గురించి కూడా జైశంకర్ ప్రస్తావించారు. భారతీయ విద్యార్థులపై వివక్ష చూపవద్దని కోరారు.