న్యూఢిల్లీ: జమ్మూ కశ్మీరులోని షక్స్‌గామ్ వ్యాలీ ప్రాంతం తమ భూభాగమేనంటూ చైనా ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ చైనా(సీపీసీ) ప్రతినిధి బృందం సోమవారం ఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయాన్ని సందర్శించి చర్చలు జరిపింది. గల్వాన్ ఘర్షణ తర్వాత రెండు దేశాల అధికార పార్టీల చర్చలు జరగడం ప్రాధాన్యతను సంతరించుకుంది. అయితే ఆ దేశ ప్రతినిధులతో చర్చలు జరపడంలో ఆంతర్యమేమిటని బీజేపీని విపక్షాలు ప్రశ్నించాయి.
సీపీసీ అంతర్జాతీయ విభాగం ఉప మంత్రి సన్ హైయాన్ సారథ్యంలోని సీపీసీ ప్రతినిధి బృందం బీజేపీ ప్రధాన కార్యాలయాన్ని సందర్శించినట్లు బీజేపీ తెలిపింది. సీపీసీ ప్రతినిధులు, బీజేపీ నాయకుల మధ్య చర్చల ఆంతర్యమేమిటని కాంగ్రెస్ ప్రశ్నించింది. చైనాతో బీజేపీ ఏ రహస్య ఒప్పందాన్ని కుదుర్చుకుందని కాంగ్రెస్ నాయకురాలు సుప్రియా శ్రీనేథ్ ఎక్స్ వేదికగా ప్రశ్నించారు.