న్యూఢిల్లీ: ఇరాన్‌పై కొనసాగుతున్న యుద్ధానికి తాత్కాలికంగా బ్రేక్ పడింది. అమెరికా-ఇరాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందంతో చమురు రవాణాకు అత్యంత కీలకమైన హొర్ముజ్ జలసంధి తిరిగి తెరుచుకోనున్నది. దీంతో ఇటీవల భగ్గుమన్న ముడి చమురు ధరలు.. నేటి కాల్పుల విరమణ తర్వాత అమాంతం దిగొచ్చాయి. అదే విధంగా భారత్‌లోనూ ఇంధన ధరలు తగ్గుతాయా? అంటే కాదనే సమాధానం వస్తున్నది. యుద్ధ సమయంలో హొర్ముజ్‌ను ఇరాన్ మూసివేయటంతో చమురు సరఫరాకు ఆటంకం ఏర్పడింది.
దీంతో క్రూడాయిల్ ధర వేగంగా పెరిగింది. సీజ్ఫైర్ ప్రకటనతో ఇప్పుడు అంతర్జాతీయ ముడి చమురు ధరలు దాదాపు 13-14 శాతం వరకు పడిపోయాయి. బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ ధర 95 డాలర్లుకు దిగొచ్చింది. దీంతో దేశీయంగానూ చమురు ధరలు తగ్గుతాయనే భావన వ్యక్తమైంది. కాల్పుల విరమణతో నౌకల ప్రయాణం మొదలైతే దేశీయంగా కొరత భయాలు లేనట్టే. కానీ, ఆ ప్రభావం రిటైల్ మార్కెట్లో కన్పించకపోవచ్చునని నిపుణులు చెబుతున్నారు. హొర్ముజ్ జలసంధి తెరుచుకున్నా.. చమురు సరఫరా ఇంతకు ముందులా లేదు. బీమా, రవాణా ఖర్చులు అధికంగా ఉన్నాయి. కాబట్టి ఇంధన ధరలు ఇప్పట్లో తగ్గే సూచనలు లేవు.