న్యూఢిల్లీ: పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా చేపట్టిన ‘ఆపరేషన్ సిందూర్’లో (Operation Sindoor) భారత రక్షణ దళం మరో ఘనత సాధించింది. సరిహద్దులో, నియంత్రణ రేఖ వెంబడి పాకిస్థాన్ ఏర్పాటు చేసిన చైనా వైమానిక రక్షణ వ్యవస్థలను భారత వైమానిక దళం విజయవంతంగా స్తంభింపజేసింది. దీంతో కేవలం 23 నిమిషాల్లోనే పాకిస్థాన్‌తోపాటు పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీవోకే) లోని 9 ఉగ్రవాద స్థావరాలను ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ యుద్ధ విమానాలు ధ్వంసం చేశాయి. కేంద్ర ప్రభుత్వం ఈ విషయాన్ని బుధవారం తెలిపింది.
కాగా, ఆపరేషన్ సిందూర్‌లో భాగంగా పాక్ ఉగ్ర స్థావరాలపై భారత్ ప్రయోగించిన క్షిపణులు, డ్రోన్లు ఎలా విజయవంతమయ్యాయో అన్నది భారత్ వివరించింది. పాకిస్థాన్ వైమానిక రక్షణ వ్యవస్థలు వాటిని గుర్తించడంలో ఎందుకు ఘోరంగా విఫలమయ్యాయో అన్నది విశ్లేషించింది. చైనా తయారీ రక్షణ పరికరాలను భారత వాయుసేన సమర్థవంతంగా జామ్ చేసిందని తెలిపింది. ‘పాకిస్థాన్‌లో ఏర్పాటు చేసిన చైనా వైమానిక రక్షణ వ్యవస్థలను భారత వైమానిక దళం జామ్ చేసింది. కేవలం 23 నిమిషాల్లోనే మిషన్‌ను పూర్తి చేసింది. భారత్ సాంకేతిక ఆధిపత్యానికి ఇది నిదర్శనం’ అని పేర్కొంది.
మరోవైపు భారత సాయుధ దళాలు ఉపయోగించిన వంద శాతం ‘మేడ్ ఇన్ ఇండియా’ వైమానిక రక్షణ వ్యవస్థ అసాధారణంగా పనిచేసిందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. చైనా తయారీ పీఎల్-15 క్షిపణులు, టర్కీకి చెందిన ‘యిహా’ యూఏవీలు, డ్రోన్లు, పాకిస్థాన్ ప్రయోగించిన దీర్ఘ శ్రేణి రాకెట్లు, క్వాడ్కాప్టర్లు, వాణిజ్య డ్రోన్లను భారత వైమానిక రక్షణ వ్యవస్థలు ఎలా అడ్డగించి ధ్వంసం చేశాయో అన్నది భారత్ వివరించింది. దీంతో భారత సైనిక స్థావరాలకు ఎలాంటి నష్టం జరుగకుండా నివారించినట్లు వెల్లడించింది.