China | న్యూఢిల్లీ, ఆగస్టు 4: భారత్‌పై చైనా కుయుక్తులు కొనసాగుతూనే ఉన్నాయి. ఈసారి భారత్‌పై ‘డ్యామ్ బాంబు’ ప్రయోగానికి డ్రాగన్ దేశం సన్నద్ధమవుతున్నది. డ్యామ్ బాంబు అంటే డ్యామ్‌పై బాంబును ప్రయోగించడం కాదు. డ్యామ్‌నే బాంబులా మార్చి పొరుగుదేశాన్ని నిర్వీర్యం చేయడం. తాజాగా సరహద్దుకు సమీపంలో బ్రహ్మపుత్ర నదిపై భారీ హైడ్రో పవర్ ప్రాజెక్టు నిర్మాణానికి సన్నాహాలు చేయడం ద్వారా భారత్‌ను తీవ్రంగా ఇబ్బందుల్లోకి నెట్టే ప్రయత్నాలను చైనా కొనసాగిస్తున్నదని ఆస్ట్రేలియన్ స్ట్రాటెజిక్ పాలసీ ఇనిస్టిట్యూట్ (ఏఎస్పీ) హెచ్చరించింది. బ్రహ్మపుత్ర నదిపై నిర్మించనున్న ఈ ప్రాజెక్ట్ పూర్తయితే అత్యంత శక్తివంతమైన జల విద్యుత్తు ప్రాజెక్టు అవుతుందని తెలిపింది. ఈ సూపర్ డ్యామ్ భారత్‌కు అన్ని విధాల ముప్పును తెస్తుందని తెలిపింది. బ్రహ్మపుత్ర నది భారత్‌లోకి ప్రవేశించే ముందు వంపు తిరుగుతుంది. అక్కడ నది 300 మీటర్ల దిగువకు లోయ వంటి ప్రాంతంలోకి నది ప్రవహిస్తుంది. అదే ప్రదేశంలో చైనా వ్యూహాత్మకంగా ఈ సూపర్ డామ్‌ను నిర్మిస్తే ఖర్చు తగ్గడమే కాక, వ్యూహాత్మకంగా పొరుగుదేశాలను కష్టాల్లోకి నెట్టవచ్చునని చైనా యోచిస్తున్నది.
చైనా నుంచి భారత్‌కు ప్రవహించే బ్రహ్మపుత్ర నదికి సంబంధించి ఇరు దేశాల మధ్య 2002లో తొలిసారిగా అంతర్జాతీయ ఒప్పందం కుదిరింది. తర్వాత 2008, 2013, 2018లలో ఒప్పందాలను పునరుద్ధరించుకున్నారు. ఆఖరిసారిగా చేసుకున్న ఒప్పందం 2023తో ముగిసింది. ఆ తర్వాత ఇరు దేశాల మధ్య ఏర్పడిన ఉద్రిక్త పరిస్థితుల వల్ల దానిని పునరుద్ధరించ లేదు. ఆ ఒప్పందం ప్రకారం ఎప్పటికప్పుడు బ్రహ్మపుత్ర నదిలో నీటి మట్టం, ఎంత జలం దిగువకు ప్రవహిస్తున్నది తదితర వివరాలను భారత్‌కు చైనా తెలియజేసేది.
ఈ డ్యామ్ నిర్మాణం జరిగితే భారత్‌ను అతివృష్టి, అనావృష్టి పరిస్థితులకు నెట్టే అవకాశాలు చైనాకు పుష్కలంగా ఉన్నాయి. మన సరిహద్దుకు కేవలం 30 కి.మీ దూరంలోని ఈ డ్యామ్ ద్వారా భారత్‌కు వచ్చే నీటిని ఆపేస్తే దిగువనున్న మన దేశానికి చెందిన అస్సాం, అరుణాచల్ ప్రదేశ్‌ల్లో తీవ్ర నీటి కొరత ఏర్పడుతుంది. తద్వారా అనావృష్టి పరిస్థితులు ఏర్పడతాయి. అలాగే వరదల సమయంలో డ్యామ్ ద్వారా హఠాత్తుగా నీటిని వదిలే ‘డ్యామ్ బ్యాంబ్’ ప్రయోగంతో అరుణాచల్ ప్రదేశ్, అస్సాం లాంటి రాష్ర్టాలతో పాటు బంగ్లాదేశ్‌లో కూడా జల ప్రళయం సృష్టించవచ్చు. ప్రస్తుతం బ్రహ్మపుత్ర నదికి సంబంధించి ఒప్పందం లేనందున సమాచార మార్పిడి జరగదు. దీంతో అధిక నీటి విడుదలపై సమాచారం ఎందుకు ఇవ్వలేదని మనం చైనాను అడిగే అవకాశం కూడా ఉండదు. దీంతో చైనా చేసే దుష్ట పన్నాగాలను అంతర్జాతీయ వేదికలపై ఎత్తి చూపే అవకాశం కూడా భారత్‌కు ఉండదు.