బీజింగ్: జమ్మూకశ్మీర్‌లో జరగనున్న జీ20 సమావేశాల(G20 Meeting)ను చైనా బహిష్కరించింది. జమ్మూకశ్మీర్ వివాదాస్పద ప్రాంతమని, అక్కడే సమావేశాలకు తాము హాజరుకాబోమని చైనా తెలిపింది. జీ20 టూరిజం వర్కింగ్ గ్రూపు సమావేశాలు శ్రీనగర్‌లో జరగనున్నాయి. అయితే ఆ సమావేశాలకు హాజరుకావడం లేదని చైనా విదేశాంగ శాఖ కార్యదర్శి వాంగ్ వెన్బిన్ తెలిపారు.
చైనా చేస్తున్న వాదనలకు ఇండియా కౌంటర్ ఇచ్చింది. స్వంత భూభాగంలో ఫ్రీగా మీటింగ్‌లు నిర్వహించుకుంటామని ఇండియా తెలిపింది. చైనాతో సంబంధాలు సజావుగా ఉండాలంటే, సరిహద్దు వద్ద శాంతి, సామరస్యం ముఖ్యమని భారత్ పేర్కొన్నది.
మూడవ జీ20 టూరిజం వర్కింగ్ గ్రూపు సమావేశాలు శ్రీనగర్‌లో మే 22 నుంచి 24 వరకు జరగనున్నాయి. దీంతో అక్కడ సెక్యూర్టీని పెంచారు. జీ20 దేశాలకు చెందిన సుమారు 60 మంది ప్రతినిధులు శ్రీనగర్‌కు రానున్నారు.
ఈ సమావేశాలకు టర్కీ హాజరుకావడంలేదు. ఈ ఈవెంట్‌కు సౌదీ అరేబియా ఇంకా రిజిస్టర్ చేసుకోలేదు. ప్రస్తుతం శ్రీనగర్‌లో మెరైన్ కమాండోలు, ఎన్ఎస్జీ గార్డులు పహారా కాస్తున్నారు. దాల్ సరస్సులో మెరైన్ పోలీసులు తిష్టవేశారు. ఎన్ఎస్జీ కమాండోలు స్థానిక పోలీసులు, పారామిలిటరీ దళాలు చెకింగ్ నిర్వహిస్తున్నారు. హౌజ్బోట్లలో తనిఖీలు చేపడుతున్నారు.