Brain Eating Amoeba | (స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్, మే 21 (నమస్తే తెలంగాణ): కేరళకు చెందిన ఓ ఐదేండ్ల చిన్నారి ‘బ్రెయిన్ ఈటింగ్ అమీబా’తో మృతి చెందింది. బాధిత బాలిక ఈ నెల 1న మళ్లీ 10వ తారీఖున స్థానికంగా ఉన్న చెరువులో స్నానానికి వెళ్లినట్టు కుటుంబసభ్యులు తెలిపారు. కలుషితమైన ఆ నీటిలో ఉన్న ఫ్రీ లివింగ్ అమీబా ఆమె ముక్కుగుండా శరీరంలోకి వెళ్లి మెదడుపై తీవ్ర ప్రభావం చూపించినట్టు వైద్యులు గుర్తించారు. వ్యాధిని సకాలంలో కుటుంబసభ్యులు గుర్తించకపోవడం, వైద్య చికిత్స అందించడంలో అప్పటికే ఆలస్యం జరుగడంతో బాలిక మరణించినట్టు వెల్లడించారు.
ఏమిటీ బ్రెయిన్ ఈటింగ్ అమీబా?
పరాన్నజీవి కానటువంటి బ్యాక్టీరియా వర్గానికి చెందిన ఒక రకమైన అమీబాతో ఈ వ్యాధి వస్తుంది. కలుషితమైన నీటిలో జీవించే ఈ జీవి ముక్కు లేదా నోటిద్వారా శరీరంలోకి ప్రవేశించి మెదడును క్రమక్రమంగా పనిచేయకుండా చేస్తుంది. దీన్ని ఒకవిధంగా మెదడును తినేసే అమీబాగా పిలుస్తారు. ఈ వ్యాధి సోకినవారికి తొలుత తీవ్ర జ్వరం, తలనొప్పి, వాంతులు అవుతాయి. వెంటనే వైద్యసాయం అందించకపోతే బాధితుడు మరణించే ప్రమాదమున్నది. కేరళలో గతంలో 2017లో ఇకసారి, 2023లో మరోసారి ఈ కేసులు బయటపడ్డాయి. వైద్య భాషలో ఈ వ్యాధిని అమీబిక్ మెనింగోన్సిఫాలిటీస్గా పిలుస్తారు.