చెన్నై, సెప్టెంబర్ 4: అల్లర్లతో అట్టుడుకుతున్న మణిపూర్, హర్యానాలా దేశం మారకుండా ఉండాలంటే వచ్చే ఎన్నికల్లో బీజేపీని గద్దె దించాలని తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ తెలిపారు. ‘స్పీకింగ్ ఫర్ ఇండియా’ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. రాష్ర్టాలను ధ్వంసం చేసేందుకు కేంద్రం ప్రయత్నిస్తున్నదని ఆరోపించారు.
ప్రతిపక్షాలు అధికారంలో ఉన్న రాష్ట్ర ప్రభుత్వాలపై ప్రతీకారం తీర్చుకునేందుకు బీజేపీ ప్రయత్నిస్తున్నదని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వాల సార్వభౌమాధికారాన్ని నాశనం చేయాలనుకుంటున్నారని నిప్పులు చెరిగారు. కాగా, దేశ సమాఖ్య నిర్మాణాన్ని దెబ్బతీసేందుకే ఒకే దేశం.. ఒకే ఎన్నికలను బీజేపీ రుద్దే ప్రయత్నం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై ఏర్పాటు చేసిన కమిటీ, దాని సిఫార్సులపై అనుమానాలు ఉన్నాయని పేర్కొన్నారు.