న్యూఢిల్లీ: తీర్పుల్లోని లోపాలను సరిచేయడానికి చట్టసభలు కొత్త చట్టాలు రూపొందించవచ్చని, కానీ తీర్పులను నేరుగా తోసిపుచ్చే అధికారం ప్రభుత్వాలకు లేదని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ స్పష్టంచేశారు. కోర్టు తీర్పులపై ప్రభుత్వాలు ఎంతవరకూ స్పందించవచ్చో రాజ్యాంగంలో స్పష్టంగా ఉందన్నారు. కేసులను విచారించి, తీర్పులిచ్చేటపుడు, సమాజం ఏ విధంగా స్పందిస్తుందనే విషయాన్ని కోర్టులు ఆలోచించవని తెలిపారు.
రాజ్యాంగానికి మాత్రమే న్యాయమూర్తులు కట్టుబడతారని, ప్రభుత్వానికి కాదన్నారు. ప్రభుత్వాలకు, న్యాయస్థానాలకు ఉన్న తేడా ఇదేనని చెప్పారు. సమాన అవకాశాలు ఉంటే మహిళలు మరింత ఎక్కువ మంది న్యాయ వ్యవస్థలోకి వస్తారన్నారు. శనివారం హిందూస్థాన్ టైమ్స్ నిర్వహించిన నాయకత్వ శిఖరాగ్ర సదస్సులో సీజేఐ ఈ మేరకు మాట్లాడారు.