న్యూఢిల్లీ : క్యాబినెట్ ఆమోదంతో నిమిత్తం లేకుండా బీజేపీ హయాంలో కీలక చట్టాలు ముందుకొస్తుంటాయని, రద్దవుతాయని కాంగ్రెస్ సీనియర్ నేత పీ చిదంబరం కాషాయ సర్కార్‌పై విరుచుకుపడ్డారు. క్యాబినెట్ సమావేశంలో చర్చించకుండానే వ్యవసాయ చట్టాల రద్దుపై ప్రధాని నరేంద్ర మోదీ తన నిర్ణయం వెల్లడించారని చిదంబరం శనివారం ట్వీట్ చేశారు. క్యాబినెట్ ముందస్తు అనుమతి లేకుండానే చట్టాలు తయారవుతాయి..రద్దవుతాయి కూడా అని ఆయన మోదీకి చురకలు వేశారు.
వివాదాస్పద సాగు చట్టాలను రద్దు చేస్తూ ప్రధాని ప్రకటన చేసిన తర్వాత హోంమంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్‌నాధ్ సింగ్, బీజేపీ చీఫ్ జేపీ నడ్డాలు మోదీని గొప్ప నేతగా, అసాధారణ నిర్ణయం తీసుకున్న రాజనీతిజ్ఞడని ఆకాశానికి ఎత్తేశారని మరి వీరంతా 15 నెలలుగా ఏం చేస్తున్నారని, సాగు చట్టాలపై వీరి సలహాలు ఎక్కడికి పోయాయని చిదంబరం ఎద్దేవా చేశారు.