రాయ్‌పూర్: విడిగా నివసిస్తున్న భార్యకు పలువురితో సంబంధం ఉన్నట్లు భర్త అనుమానించాడు. ఆమె ఇంటికి చేరుకుని పిల్లల ముందే దారుణంగా హింసించాడు. కాళ్లు, చేతులు కట్టేసి కొట్టాడు. జుట్టు కత్తిరించాడు. ఆమెతో బలవంతంగా మూత్రం తాగించాడు. (Man Tortures Wife) ఛత్తీస్‌గఢ్‌లోని కోరియా జిల్లాలో ఈ సంఘటన జరిగింది. తార, జితేంద్ర ఘసియా 15 ఏళ్ల కిందట ప్రేమించుకుని పెళ్లి చేసుకున్నారు. వీరికి నలుగురు పిల్లలు ఉన్నారు. అయితే వైవాహిక విభేదాలు, భర్త వేధింపుల కారణంగా తార విడిగా జీవిస్తున్నది. ఇళ్లల్లో పనులు చేస్తూ పిల్లలను పోషిస్తున్నది. కష్టకాలంలో సహాయం చేసిన ఒక వ్యక్తి ఇంట్లో ఆమె నివసిస్తున్నది.
కాగా, జూన్ 14న భార్య తార నివసిస్తున్న ఇంటికి భర్త జితేంద్ర చేరుకున్నాడు. మద్యం సేవించి వచ్చిన అతడు ఆమెను ఇంటి నుంచి బయటకు పిలిచి దూషించాడు. ఇతర వ్యక్తులతో సంబధాలున్నాయని ఆరోపించాడు. భార్య కాళ్లు, చేతులు కట్టేసి కొట్టాడు. పిల్లల ముందే ఆమెను హింసించాడు. జుట్టు కత్తిరించాడు. ముఖానికి నల్లరంగు, ఇంజిన్ ఆయిల్ పూశాడు. తన పిల్లలతో కూడా భార్య చెంపలపై కొట్టించాడు. పిల్లల్లో ఒకరితో మూత్రం తాగించాడు. అలాగే తన మూత్రాన్ని కూడా భార్యతో తాగించాడు. ఆమెను సజీవంగా తగులబెడతానని బెదిరించాడు.
మరోవైపు భర్త దాడిలో తీవ్రంగా గాయపడిన తార పోలీసులకు ఫిర్యాదు చేసింది. తనకు న్యాయం కావాలని, భర్తకు శిక్ష పడాలని డిమాండ్ చేసింది. దీంతో పలు సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. జితేంద్రను అరెస్ట్ చేశారు. అతడ్ని కోర్టులో హాజరుపర్చిన తర్వాత రిమాండ్ నిమిత్తం జైలుకు తరలించారు. అయితే జితేంద్ర తన భార్యను దారుణంగా కొట్టి హింసించిన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.