కొత్తగూడెం ప్రగతి మైదాన్, ఏప్రిల్ 16 : భద్రతా దళాలు, మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో ఇద్దరు మావోయిస్టు నేతలు మృతిచెందారు. ఈ ఘటన ఛత్తీస్‌గఢ్‌లోని కొండగావ్ జిల్లాలో చోటు చేసుకుంది. బస్తర్ రేంజ్ ఐజీ సుందర్రాజ్ పాటిలింగం మీడియాకు వివరాలు వెల్లడించారు. జిల్లా సరిహద్దు కిలమ్-బూర్గుమ్ అడవుల్లో జిల్లా రిజర్వు గార్డ్స్(డీఆర్జీ), బస్తర్ ఫైటర్స్ సంయుక్తంగా మంగళవారం సెర్చింగ్ ఆపరేషన్ నిర్వహించాయి. ఈ క్రమంలో మావోయిస్టులు తారసపడి జవాన్లపైకి కాల్పులు జరిపారు. 30 నిమిషాలకు పైగా భీకరపోరు జరిగింది. తర్వాత జవాన్లు ఆ ప్రాంతాన్ని పరిశీలించి, ఇద్దరు మావోయిస్టుల మృతదేహాలతో పాటు ఒక ఏకే-47 రైఫిల్, ఇతర ఆయుధ వస్తు, సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. మృతిచెందిన వారిలో మోస్ట్ వాంటెడ్ తూర్పు బస్తర్ డివిజన్ కమాండర్, డీవీసీఎం హల్దార్ కశ్యప్, ఏరియా కమిటీ సభ్యుడు రామె ఉన్నట్లు ఐజీ పాటిలింగం వెల్లడించారు. కశ్యప్ తలపై రూ.8 లక్షలు, రామేపై రూ.5 లక్షల రివార్డు ఉన్నట్లు నిర్ధారించారు.