ముంబై, డిసెంబర్ 9 (నమస్తే తెలంగాణ) : 40 ఏండ్ల క్రితం నాటి దోపిడీ కేసులో ఛత్రపతి శంభాజీనగర్‌లోని అదనపు సెషన్స్ కోర్టు 60 ఏండ్ల నిందితుడిని నిర్దోషిగా ప్రకటించింది. 1984 నవంబర్ 21న ఔరంగాబాద్‌లోని బాబా పెట్రోల్ పంప్ ప్రాంతం నుంచి ఐదుగురు వ్యక్తులు రిక్షాను అద్దెకు తీసుకుని రాత్రి 10 గంటల సమయంలో మలివాడలోని పండిట్ అధవ్ ఫామ్ హౌస్‌ను దోచుకున్నారు. దీనిపై కంటోన్మెంట్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. పోలీసులు ఐదుగురు నిందితులను అరెస్టు చేశారు. నేరానికి ఉపయోగించిన తుపాకీ స్వాధీనం చేసుకున్నారు. బెయిల్‌పై విడుదలైన తర్వాత నిందితులందరూ పరార్ అయ్యారు.
2019లో వారిలో ఒకరిని పోలీసులు పట్టుకుని కోర్టులో హాజరుపరిచారు. అతడిపై కేసు విచారణ 2024 ఫిబ్రవరిలో ప్రారంభమైంది. తాజాగా న్యాయమూర్తి దేశ్ పాండే నిందితుడిని నిర్దోషిగా ప్రకటిస్తూ తీర్పు చెప్పారు. పరారీలో ఉన్న సమయంలో ఈ నిందితుడు 40 ఏండ్లుగా ఛత్రపతి శంభాజీనగర్‌లో ఆటోరిక్షా నడుపుతున్నాడు. నిందితుడు లైసెన్స్, పర్మిట్ లేదా బ్యాడ్జ్ పొందడానికి పోలీసుల నుంచి అతను ఎటువంటి ఇబ్బందులు ఎదురోకపోవడం గమనార్హం. కేసు పత్రాలు చెడిపోకుండా ఉండటానికి కోర్టు వాటిని చాలా జాగ్రత్తగా నిర్వహించాల్సి వచ్చింది.