చిరపుంజి : మేఘాలయలోని చిరంపుంజిలో 24 గంటల్లో భారీ వర్షాపాతం నమోదైంది. బుధవారం ఉదయం 8.30 గంటల వరకు 811.6 మిల్లీ మీటర్ల భారీ వర్షాపాతం రికార్డయ్యింది. 1995 తర్వాత జూన్‌లో అత్యధికంగా వర్షం కురిసిందని భారత వాతావరణ శాఖ (IMD) తెలిపింది. ప్రపంచంలోనే అత్యంత తేమ ఉండే ప్రదేశాల్లో చిరపుంజి ఒకటి. చిరపుంజిలో జూన్ మాసంలో పది సందర్భాల్లో 750 మిల్లీ మీటర్ల కంటే ఎక్కువ వర్షం కురిసిందని వాతావరణ శాఖ పేర్కొంది. జూన్ 16, 1995న తూర్పు ఖాసీ హిల్స్‌లో ఉన్న పట్టణంలో 1563.3 మిమీ వర్షపాతం నమోదైంది. అంతకు ముందు రోజు జూన్ 15, 1995న 930 మిల్లీ మీటర్ల వర్షం కురిసింది.
రుతుపవనాలు చురుగ్గా ఉండడంతో ఈశాన్య రాష్ట్రాల్లో వర్షాలు భారీగా కురుస్తున్నాయి. నైరుతి రుతుపవనాలు బుధవారం మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, కోస్తా ఆంధ్ర ప్రదేశ్‌లోని పలు ప్రాంతాల్లో మరింత విస్తరించాయని వాతావరణ శాఖ తెలిపింది. రాబోయే ఐదు రోజుల్లో ఈశాన్య, పశ్చిమ బెంగాల్, సిక్కింలో అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. బంగాళాఖాతం నుంచి తక్కువ ట్రోపోస్పిరిక్ స్థాయిలో బలమైన నైరుతి గాలులు, మధ్య ట్రోపోస్పిరిక్ స్థాయిల్లో పశ్చిమాన ద్రోణి ప్రభావంతో బుధ, గురువారాల్లో అరుణాచల్ ప్రదేశ్, అసోం, మేఘాలయలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ వివరించింది.