చెన్నై, నవంబర్ 7: అరేబియా సముద్రంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో తమిళనాడును భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. చెన్నైలో గత ఆరేండ్లలో ఎన్నడూ లేనంతగా శనివారం రాత్రి నుంచి 12 గంటల్లోనే 20 సెంటీమీటర్ల కుంభవృష్టి కురిసింది. చెన్నై చుట్టు పక్కల ప్రాంతాల్లోనూ భారీ వర్షాలు పడుతున్నాయి. అక్కడక్కడా 23 సెంటీమీటర్ల వాన పడింది. చెన్నై వీధులు నీట మునిగాయి. లోతట్టు ప్రాంతాల్లో భారీగా నీరు నిలిచింది. వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం స్టాలిన్ పర్యటించారు. ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సహాయ కార్యక్రమాల్లో నిమగ్నమయ్యాయి. ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. అధికారులు ప్రజలకు వరద హెచ్చరికలను జారీచేశారు. డ్యాముల్లో నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. భారీ వర్షాల కారణంగా బడులకు, కాలేజీలకు రెండు రోజుల పాటు రాష్ట్ర ప్రభుత్వం సెలవు ప్రకటించింది. తీర ప్రాంత జిల్లాలకు ఐఎండీ ఈ నెల 10, 11న రెడ్ అలర్ట్ ప్రకటించింది.