శ్రీనగర్, జూన్ 6: ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన చినాబ్ రైల్వే వంతెన జమ్ముకశ్మీర్‌లో ప్రజలకు అందుబాటులోకి వచ్చింది. ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం దీనిని జాతికి అంకితం చేశారు. ఇంజనీరింగ్ అద్భుతమైన ఈ రైలు వంతెనను ఉదంపూర్-శ్రీనగర్-బారాముల్లా రైల్ లింక్ (యూఎస్బీర్ఎల్) ప్రాజెక్టులో భాగంగా నిర్మించారు. కశ్మీర్ లోయను మిగతా భారతదేశంతో ఈ బ్రిడ్జి కలుపుతుంది. కట్రా నుంచి శ్రీనగర్ వరకు నడిచే వందేభారత్ రైలుకు ప్రధాని జెండా ఊపడం ద్వారా దీనిని ప్రారంభించారు.
ఈఫిల్ టవర్ కన్నా ఎత్తయిన ఈ వంతెన చినాబ్ నదీ గర్భం నుంచి 359 మీటర్ల ఎత్తులో ఉంటుంది. ఈ ఆర్చి స్టీల్ బ్రిడ్జి పొడవు 1351 మీటర్లు. ఈ సందర్భంగా ప్రధాని అంజీ నదిపై నిర్మించిన తొలి రైల్వే కేబుల్ వంతెన అంజీ కేబుల్ బ్రిడ్జిని, 46 వేల కోట్ల రూపాయల అభివృద్ధి పనులను, మరో వందేభారత్ రైలు సర్వీసును ప్రారంభించారు. చినాబ్ వంతెన నిర్మాణాన్ని చేపట్టిన ఇంజినీర్ల బృందంలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన గాలి మాధవీలత సభ్యురాలిగా ఉన్నారు. గత 17 సంవత్సరాలుగా ఈ ప్రాజెక్ట్ నిర్మాణానికే ఆమె అంకితమయ్యారు.