డెహ్రాడూన్, జూలై 7: ఉత్తరాఖండ్‌లో చార్ధామ్ యాత్రను తాత్కాలికంగా నిలిపివేశారు. గర్వాల్ రీజియన్‌లో ఆది, సోమవారం భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించడంతో ముందు జాగ్రత్త చర్యగా ఆదివారం యాత్రను ఆపేశారు. యాత్రికుల భద్రతను దృష్టిలో ఉంచుకుని ఈ యాత్రను తాత్కాలికంగా నిలిపివేసినట్టు గర్వాల్ కమిషనర్ వినయ్ శంకర్ పాండే తెలిపారు.
చార్ధామ్ యాత్రలో పాల్గొనే యాత్రికులు ఆదివారం ఎక్కడికక్కడే నిలిచిపోవాలని కోరామన్నారు. వాతావరణ శాఖ నుంచి తదుపరి సూచనలు వచ్చే వరకు యాత్రను కొనసాగించవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. కాగా, భారీ వర్షాలు ఉత్తరాఖండ్‌ను అతలాకుతలం చేస్తున్నాయి. పలు చోట్ల రహదారులపై కొండచరియలు విరిగిపడటంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. విష్ణుప్రయాగ్ వద్ద అలకనంద నది ప్రమాదస్థాయికి దగ్గరగా ప్రవహిస్తున్నది.