డెహ్రాడూన్ : చార్ ధామ్ యాత్ర ఉత్తరాఖండ్లో ఆదివారం ప్రారంభమైంది. ఆరు నెలల శీతాకాల విరామం తర్వాత అక్షయ తృతీయ నాడు గంగోత్రి, యయునోత్రి పుణ్యక్షేత్రాల ద్వారాలు తెరచుకున్నాయి. వందలాది భక్తుల నడుమ, వేద మంత్రాల పఠనంతో గంగోత్రి ఆలయ ద్వారం మధ్యాహ్నం 12.15 గంటలకు, యమునోత్రి ఆలయ ద్వారం 12.35 గంటలకు తెరుచుకున్నాయి. గంగోత్రిలో జరిగిన పూజకు ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి విచ్చేశారు. క్లీన్ అండ్ గ్రీన్ యాత్రకు భక్తులు సహకరించాలని ఆయన కోరారు. కాగా, తొలిసారిగా బద్రినాథ్, కేదార్నాథ్ గంగోత్రి పుణ్యక్షేత్రాలకు హిందూయేతరుల ప్రవేశంపై ఆంక్షలు నిషేధించారు.
సనాతనులు కానివారు పంచగవ్య (గోమూత్రం, పేడ, పాలు, పెరుగు, నెయ్యి మిశ్రమం)ను సేవించాలని గంగోత్రి ఆలయ కమిటీ తప్పనిసరి నిబంధన విధించింది. కేదార్నాథ్, బద్రీనాథ్ ఆలయాల్లో మాత్రం హిందూయేతరులు సనాతన ధర్మంపై విశ్వాసాన్ని ధ్రువీకరిస్తూ అఫిడవిట్ సమర్పించాలి. కాగా, కేదార్నాథ్, బద్రినాథ్ ఆలయాలు భక్తుల కోసం ఏ నెల 22, 23 తేదీల నుంచి తెరచి ఉంచుతారు. ఈ ఏడాది చార్ ధామ్ యాత్ర కోసం 19 లక్షల మంది భక్తులు తమ పేర్లను నమోదు చేసుకున్నారు.