Akhilesh Yadav | ప్రధాని నరేంద్రమోదీపై సమాజ్వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ తనదైన శైలిలో సెటైర్లు వేశారు. ప్రస్తుతం జరుగుతున్న సార్వ్రతిక ఎన్నికల్లో ‘క్యోటో (వారణాసి)’ సీటు మినహా ఉత్తరప్రదేశ్లో బీజేపీకి ఓటమి తప్పదన్నారు. మంగళవారం ఆయన లాల్ గంజ్లో ఎస్పీ అభ్యర్థికి మద్దతుగా జరిగిన ఎన్నికల ప్రచార సభలో మాట్లాడుతూ ఈ దఫా ఏ వ్యూహాలతో వచ్చినా బీజేపీని తుడిచి పెట్టాలని ఉత్తరప్రదేశ్ వాసులు నిర్ణయించుకున్నారన్నారు. యూపీలో ‘ఇండియా’ కూటమికి విశేష స్పందన వస్తున్నదన్నారు.
జపాన్ లోని క్యోటో నగరంగా వారణాసిని అభివృద్ధి చేస్తానంటూ ప్రధాని నరేంద్రమోదీ గతంలో ఇచ్చిన హామీని గుర్తు చేస్తూ అఖిలేశ్ యాదవ్ సెటైర్లు వేశారు. ఎన్నికల ప్రారంభంలో 400 సీట్లకు పైగా గెలుచుకుంటామని బీజేపీ నినదిస్తే, ఇప్పుడు ప్రజలు బీజేపీకి 140 సీట్లు కూడా ఇవ్వరన్నారు. బీజేపీ ఇచ్చిన ప్రతి హామీ బూటకమేనని మండి పడ్డారు. అఖిలేశ్ కోసం ప్రజలు భారీగా దూసుకు రావడంతో వారిని నియంత్రించడానికి పోలీసులు లాఠీ చార్జీ చేశారు. దీంతో సభా వేదిక వద్ద స్వల్ప ఉద్రిక్తత నెలకొంది.