న్యూఢిల్లీ : ఐటీ రంగంలో పెను మార్పులు సంభవిస్తున్నాయి. క్లయింట్ అవసరాలు, సాంకేతికత మారుతున్న నేపథ్యంలో ఐటీ కంపెనీలు తమ ఉద్యోగుల సంఖ్యను పునర్వ్యవస్థీకరిస్తున్నాయి. ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) వంటి నూతన సాంకేతికతలు ఈ మార్పులకు ప్రధాన కారణమవుతున్నాయి. టీసీఎస్ వంటి దిగ్గజ సంస్థ ఇప్పటికే 12 వేల మంది ఉద్యోగులను తగ్గించుకోనున్నట్టు ప్రకటించింది. అయితే, కొత్త నైపుణ్యాలకు అనుగుణంగా తమ పనితీరు మార్చుకోని వారిపైనే ఈ ప్రభావం పడనుంది. ముఖ్యంగా మధ్య, సీనియర్ స్థాయి ఉద్యోగులు మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా తమను తాము మార్చుకోలేకపోతున్నారు. నాస్కామ్ నివేదిక ప్రకారం ప్రస్తుతం ఈ రంగంలో 54 లక్షల మంది ఉద్యోగులున్నారు. వీరు ఈ రంగంలో కొనసాగాలంటే 2030 నాటికి వీరిలో 80 శాతం మంది డిజిటల్ నైపుణ్యాలను పెంపొందించుకోవాల్సి ఉంటుంది.
ఆర్డర్లు భారీగా వస్తున్నప్పటికీ ఐటీ సేవలు, ముఖ్యంగా పీసీలు, సర్వర్ల వంటి వాటిపై క్లయింట్ల వ్యయం ప్రస్తుతం తాత్కాలికంగా నిలిచిపోయింది. ఫలితంగా ఈ మార్కెట్‌పై ఎక్కువగా ఆధారపడిన ఇంటెల్ వంటి అంతర్జాతీయ సంస్థలు కూడా ఉద్యోగులను తగ్గించుకుంటున్నాయి. ఈ ట్రెండ్ భారతీయ ఐటీ సంస్థల్లోనూ కనిపించవచ్చని అంచనా. దేశీయ ఐటీ రంగంలో 2-5 శాతం మేర ఉద్యోగుల కోత ఉండవచ్చని, ఇది 1-2.7 లక్షల మందిపై ప్రభావం చూపవచ్చని అంచనా. నైపుణ్య లేమి ఉన్నవారిపైనా, తక్కువ పనితీరు కనబరుస్తున్న వారిపైనా ఈ ప్రభావం ఎక్కువగా ఉండవచ్చు.
గత సంవత్సర కాలంలో అగ్రశ్రేణి ఐటీ కంపెనీల్లో ఉద్యోగుల వలసలు 150-200 బేసిస్ పాయింట్ల మేర పెరిగాయి. అదే సమయంలో కొత్త నియామకాలు తగ్గాయి లేదా పూర్తిగా నిలిచిపోయాయి. టెక్ మహీంద్రా, ఎల్టీఐ మైండ్‌ట్రీ వంటి సంస్థలు తమ ఉద్యోగుల సంఖ్యను స్థిరంగా తగ్గిస్తూ వస్తున్నాయి. ఉద్యోగులను నియమించుకున్న కొన్ని సంస్థల్లోనూ ప్రాజెక్టులు ఆలస్యం కావడంతో ఉద్యోగులు ఖాళీగా ఉంటున్నారు. ఇది కంపెనీలకు వేతన ఖర్చులను పెంచుతూ, ఒక్కో ఉద్యోగి నుంచి వచ్చే ఆదాయాన్ని తగ్గిస్తోంది. ఏఐ రాకతో ఐటీ రంగం ఇంకా ప్రారంభ దశలోనే ఉంది. ఐటీ రంగంలో ఆదాయాలు తగ్గుముఖం పట్టడం, ప్రాజెక్టులు ఆలస్యం కావడంతో క్లయింట్ల వ్యయం స్తంభించిపోయింది. దీనివల్ల ఉద్యోగుల వలసలు పెరిగి, ఉద్యోగులు ఖాళీగా ఉంటున్నారు. ఏఐ వంటి నైపుణ్యాల కొరతను అధిగమించేందుకు టీసీఎస్ వంటి సంస్థలు ఉద్యోగులను తగ్గిస్తున్నాయి. ఆర్డర్లు భారీగా ఉన్నప్పటికీ, భవిష్యత్ అవసరాల కోసం ఐటీ సంస్థలు తమను తాము పునర్‌వ్యవస్థీకరించుకుంటున్నాయి. ఈ క్రమంలో 2-5 శాతం మేర ఉద్యోగుల కోత ఉండవచ్చని అంచనా వేస్తున్నారు.