న్యూఢిల్లీ, జనవరి 2: స్మార్ట్‌ఫోన్ ఉన్న చాలామంది గూగుల్ పే, ఫోన్ పే, పేటీఏం వినియోగిస్తున్నారు. యూపీఐ (యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్)ను ఉపయోగించి చిన్న మొత్తం నుంచి పెద్ద మొత్తంలో డిజిటల్ చెల్లింపులు జరుపుతున్నారు. అయితే యూపీఐ ద్వారా జరిపే చెల్లింపులపై జనవరి 1 నుంచి కొత్త నిబంధనలు అమల్లోకి వచ్చాయి. ఆర్బీఐ, ఎన్పీసీఐ (నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా) తాజాగా పలు మార్పులను ప్రకటించాయి. వీటిలో లావాదేవీల పరిమితి పెంపు నుంచి యాక్టివ్‌లో లేని యూపీఐ ఐడీలను డీయాక్టివేట్ చేయడం వంటివి ఉన్నాయి. దవాఖానలు, విద్యాసంస్థలకు చేసే యూపీఐ పేమెంట్స్ లావాదేవీల పరిమితిని రూ.లక్ష నుంచి రూ.5 లక్షలకు పెంచారు. ఏడాది కాలంగా యాక్టివ్‌లో లేని ఖాతాల యూపీఐ ఐడీలు, నంబర్లను జనవరి 1 నుంచి రద్దు (డీయాక్టివేట్) చేయాలని ఎన్పీసీఐ ఆదేశించింది.
లావాదేవీలపై రుసుములు
ఆన్లైన్ వాలెట్ నుంచి ప్రీపెయిడ్ చెల్లింపు రూ.2వేల కంటే ఎక్కువ ఉన్నప్పుడు వ్యాపారి యూపీఐ లావాదేవీల కోసం 1.1 శాతం వరకు ఇంటర్‌ఛేంజ్ ఫీజు వసూలు చేయనున్నారు. మర్చంట్ లావాదేవీలు జరిగినప్పుడు వ్యాపారి నుంచి ఈ చార్జీలు వసూలు చేస్తారు. మోసాలను అరికట్టేందుకు నాలుగు గంటల పరిమితి నిబంధన తీసుకొచ్చారు. ఇంతకుముందు లావాదేవీలు చేయని వ్యక్తుల మధ్య రూ.2 వేల కంటే ఎక్కువ విలువ గల మొదటి చెల్లింపు కోసం నాలుగు గంటల పరిమితి విధించనున్నారు.