న్యూఢిల్లీ, ఆగస్టు 31 : ప్రపంచవ్యాప్తంగా ఉన్న 250 కోట్ల జీమెయిల్ వినియోగదారులను గూగుల్ అప్రమత్తం చేసింది. అంతర్జాతీయ సైబర్ నేరగాళ్ల నుంచి హ్యాకింగ్ దాడులు విపరీతంగా పెరిగిన నేపథ్యంలో, ప్రతి ఒక్కరూ తమ ఖాతాల భద్రతపై తక్షణమే దృష్టి సారించాలని కీలక హెచ్చరికలు జారీచేసింది.
‘షైనీ హంటర్స్’ అనే అంతర్జాతీయ హ్యాకర్ల ముఠా నుంచి ప్రమాదం పొంచివుందని, తమ జీమెయిల్ ఖాతా భద్రతకు అదనపు జాగ్రత్తలు తీసుకోవాలని యూజర్లకు గూగుల్ సూచించింది. యూజర్లు వెంటనే తమ పాస్వర్డ్లను మార్చుకోవడంతోపాటు, అదనపు భద్రతా ఫీచర్ ‘టూ-స్టెప్ వెరిఫికేషన్’ (2ఎస్వీ)ను ఎనేబుల్ చేసుకోవాలని కోరింది.