చండీగఢ్, అక్టోబర్ 10 : హర్యానా అదనపు డీజీపీ వై పూరన్ కుమార్ ఆత్మహత్య కేసు విచారణకు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్)ను ఏర్పాటు చేస్తున్నట్టు చండీగఢ్ పోలీస్ చీఫ్ సాగర్ ప్రీత్ హుడా శుక్రవారం ప్రకటించారు. ఈ సిట్‌కు ఐజీ పుష్పేందర్ కుమార్ నేతృత్వం వహిస్తారని తెలిపారు. తన భర్త ఆత్మహత్యకు రాష్ట్ర డీజీపీ శత్రుజీత్ సింగ్ కపూర్, రోహతక్ ఎస్పీ నరేంద్ర బిజార్నియాలే కారణమని ఆరోపిస్తూ పూరన్ కుమార్ భార్య, ఐఏఎస్ అధికారి అన్మీత్ కుమార్ గురువారం ఫిర్యాదు చేయడంతో హర్యానా ప్రభుత్వం వారిపై ఎట్టకేలకు ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. అయితే నమోదు చేసిన ఎఫ్ఐఆర్ అసంపూర్తి సమాచారంతో ఉందని, దానిని సరిదిద్దాలని పూరన్ కుమార్ భార్య అన్మీత్ కుమార్ శుక్రవారం డిమాండ్ చేశారు.
ఈ మేరకు ఆమె చండీగఢ్ సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ కన్వర్దీప్ కౌర్‌కు లేఖ రాశారు. కాగా, పూరన్‌కుమార్ మరణించి మూడు రోజులైనా ఆయన మృతదేహానికి పోస్ట్‌మార్టం నిర్వహించడానికి కుటుంబ సభ్యులు నిరాకరించారు. పూరన్‌కుమార్ ఆత్మహత్య చేసుకోవడం దారుణమని సీపీఐ సెంట్రల్ కంట్రోల్ కమిషన్ అధ్యక్షులు డాక్టర్ కె నారాయణ అన్నారు. అధికారుల నిరంతర వేధింపులు, అవమానాలు తట్టుకోలేక ప్రాణాలు తీసుకున్నారని ఐపీఎస్ భార్య ఆరోపణల నేపథ్యంలో హర్యానా డీజీపీ శత్రుజిత్ కుమార్ సహా బాధ్యులపై రోహిత్ వేముల చట్టం ప్రకారం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.