న్యూఢిల్లీ : పాఠశాల విద్యలో అత్యుత్తమ ప్రతిభను చూపిన రాష్ర్టాలు, కేంద్ర పాలిత ప్రాంతాలలో చండీగఢ్ అగ్రస్థానంలో నిలువగా పంజాబ్, కేరళ, ఢిల్లీ ద్వితీయ స్థానాన్ని దక్కించుకున్నాయి. కేంద్ర విద్యా శాఖకు చెందిన పర్ఫార్మెన్స్ గ్రేడింగ్ ఇండెక్స్ 2025-26(పీజీఐ) ప్రకారం ఈ మూడు రాష్ర్టాలే కాక దాద్రా-నగర్ హవేలీ, డామన్-డయ్యూ కూడా ద్వితీయ స్థానాన్ని పొందాయి. పర్ఫార్మెన్స్ గ్రేడింగ్ ఇండెక్స్ 2.0 అనేది రాష్ర్టాలు, యూటీలకు ర్యాంకులు కేటాయించడానికి బదులుగా వాటిని వివిధ గ్రేడ్లుగా వర్గీకరించడం ద్వారా వాటి పనితీరును అంచనా వేస్తుంది. ఈ గ్రేడింగ్ విధానం వల్ల అనేక రాష్ర్టాలు, యూటీలు ఒక పనితీరు స్థాయి పరిధిలో ఉండే అవకాశం కలుగుతుంది. ఫలితాలు, పాలన-నిర్వహణ అనే రెండు విభాగాల పరిధిలోని 70 సూచికల ఆధారంగా పీజీఐ 2.0ని రూపొందించారు.
దేశంలో విద్యార్థుల డ్రాపౌట్ రేటు తగ్గుముఖం పడుతున్నది. యూఎస్ఐడీఈ 2025-26 నివేదిక ప్రకారం పాఠశాలల్లో విద్యార్థుల డ్రాపౌట్ (మధ్యలో చదువు మానేయడం) రేటు అన్ని కీలక విద్యా దశల్లో గణనీయంగా, వరుసగా తగ్గింది. అదే సమయంలో ఫౌండేషన్ (ప్రాథమిక ప్రారంభ దశ), ప్రిపరేటరీ (సన్నాహక దశ) స్థాయిల్లో విద్యార్థుల కొనసాగింపు రేటు స్వల్పంగా తగ్గింది. 2022-23, 2024-25 లతో పోలిస్తే 2025-26 విద్యా సంవత్సరంలో ప్రిపరేటరీ, సెకండరీ స్థాయిలలో పాఠశాల మధ్యలో చదువు మానేసిన వారి డ్రాపౌట్ రేట్లలో గణనీయమైన తగ్గుదల కన్పించింది.