న్యూఢిల్లీ, జూలై 20: సెంట్రల్ ఢిల్లీలో సోమవారం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ) చేపట్టిన చలో పార్లమెంట్ ర్యాలీలో పాల్గొన్న నిరసనకారులు పార్లమెంట్ చుట్టూ ఉన్న బారికేడ్లను దాటడానికి ప్రయత్నించడంతో భద్రతా దళాలు బాష్పవాయువును ప్రయోగించడం, లాఠీచార్జ్ చేయడం, అల్లర్ల నిరోధక వాహనాలను రంగంలోకి దించడం వంటి చర్యలు చేపట్టాయి. వర్షాకాల పార్లమెంట్ సమావేశాల ప్రారంభం రోజున చేపట్టిన ఈ నిరసన ర్యాలీ పోలీసులు, ఆందోళనకారుల మధ్య పదేపదే ఘర్షణలకు దారితీసింది. ఇటీవలి కాలంలో దేశ రాజధానిలో ఇంత భారీ స్థాయిలో భద్రతా చర్యలు చేపట్టడం ఇదే మొదటిసారి. పార్లమెంట్ వైపు తమ ర్యాలీని ప్రారంభించేందుకు నిరసనకారులు పోలీసు బారికేడ్లను ఛేదించుకుని జంతర్ మంతర్‌ను దాటేందుకు ప్రయత్నించడంతో తొలి ఘర్షణ చెలరేగింది. నిరసన తీవ్రతరం కావడంతో ఆందోళనకారులు పార్లమెంట్ సమీపంలోని అత్యంత పటిష్టమైన భద్రతగల ప్రాంతంలో ఏర్పాటు చేసిన పలు బారికేడ్లను ఛేదించుకుని వెళ్లేందుకు ప్రయత్నించారు. దీంతో జరిగిన ఘర్షణలో నిరసనకారులు, పోలీసు సిబ్బంది గాయపడ్డారు. జంతర్ మంతర్ వద్దకు భారీగా చేరుకున్న పోలీసులు సీజేపీ వ్యవస్థాకుడు అభిజీత్ దీప్కేను అదుపులోకి తీసుకున్నట్లు పార్టీ నాయకులు తెలిపారు. నీట్ పరీక్షలో జరిగిన అవకతవకలకు సంబంధించి కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా కోరుతూ పార్లమెంట్ మార్చ్‌కు సీజేపీ పిలుపునిచ్చింది.
ప్రభుత్వానికి మూడు డిమాండ్లు
సీజేపీ ప్రతినిధి బృందం సోవారం కేంద్ర మంత్రి జేపీ నడ్డాను కలుసుకుని నీట్ యూజీ ప్రశ్నపత్రం లీకేజీ కేసులో జవాబుదారీని డిమాండు చేస్తూ ఒక పిటిషన్‌ని సమర్పించింది. సీజేపీ డిమాండ్లపై ప్రభుత్వ నాయకత్వంతో సంప్రదించడానికి తనకు కొంత సమయం కావాలని నడ్డా కోరినట్లు సీజేపీ అధికార ప్రతినిధి అశుతోష్ రాంకా తెలిపారు. విద్యా వేత్త, వాతావరణ కార్యకర్త సోనమ్ వాంగ్చుక్ను వెంటనే విడుదల చేయడం, విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడం, ఆత్మహత్య చేసుకున్న నీట్ ఆశావహులకు రూ. 1 కోటి చొప్పున నష్ట పరిహారం చెల్లించడం సీజేపీ ఇతర డిమాండ్లు.
నిరసనను విరమించండి: ప్రభుత్వం
కేంద్ర విద్యా మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా కోరుతూ సీజేపీ చేస్తున్న నిరసనపై ప్రభుత్వం మొదటిసారి స్పందిస్తూ ఒక ప్రకటన విడుదల చేసింది. ప్రభుత్వంతో చర్చలు జరపడానికి సీజేపీ నిరసనకారులు ఒక మొదటి ప్రతిపాదన చేశారని కేంద్ర మంత్రి జేపీ నడ్డా ధృవీకరించారు. ఈ ఉదయం మొదటిసారిగా ప్రభుత్వంతో చర్చలు జరపాలనే ప్రతిపాదన నిరసనకారుల నుంచి వచ్చింది. ఉదయం 11.50 గంటల నుంచి మా చర్చలు కొనసాగుతున్నాయి అని ఎక్స్ పోస్ట్‌లో నడ్డా పేర్కొన్నారు. కాగా, కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ సోమవారం భేటీ అయ్యారు. సీజేపీ చలో పార్లమెంట్ నేపథ్యంలో వీరిద్దరూ భేటీ కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది.
దీక్ష కొనసాగిస్తా: వాంగ్‌చుక్
దేశరాజధాని ఢిల్లీలోని సఫ్దర్ జంగ్ దవాఖానలో చికిత్స పొందుతున్న ప్రముఖ సామాజిక కార్యకర్త సోనమ్ వాంగ్‌చుక్ తన నిరాహార దీక్షను కొనసాగించనున్నట్లు ప్రకటించారు. యువజన నేతలను పార్లమెంట్లో ఎంపీలను కలవడానికి అనుమతించేవరకు లేదా ఎంపీలు తనను దవాఖానలో చూసేందుకు వచ్చేవరకూ, తన దీక్షను విరమించబోనని వాంగ్‌చుక్ స్పష్టం చేశారు.