Chabahar | చాబహార్ పోర్టుపై భారత్‌కు ఇచ్చిన మినహాయింపులను రద్దు చేయాలని అమెరికా నిర్ణయించింది. దాంతో భారత్‌కు ఆర్థికంగా, వ్యూహాత్మకంగా పెద్ద దెబ్బకానున్నది. ఈ పోర్టులో మౌలిక సదుపాయాల అభివృద్ధిలో భాగంగా భారత్ ఇప్పటికే 85 మిలియన్ డాలర్లు (రూ.749కోట్లు) పెట్టుబడి పెట్టింది. దీన్ని రూ.120 మిలియన్ డాలర్లకు పెంచేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఇరాన్ ఫ్రీడమ్ అండ్ కౌంటర్ ప్రొలిఫిరేషన్ యాక్ట్ (ఐఎఫ్‌సీఏ) కింద చాబహార్ ఆంక్షల మినహాయింపులను రద్దు చేయాలనే నిర్ణయం భారత్‌కు భారత్‌కు తీవ్ర నష్టం జరుగనున్నది. సుంకాల విషయంలో ఇప్పటికే భారత్-అమెరికా మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. తాజాగా అమెరికా తీసుకున్న ఈ చర్య కారణంగా ఓడరేవులో భారతీయ ఆపరేట్లపై అమెరికా జరిమానాలు విధిస్తామని బెదిరింపులకు దిగుతున్నది. ఇది భారతదేశంలోని అతి ముఖ్యమైన ప్రాంతీయ కనెక్టివిటీ ప్రాజెక్టుల్లో ఒకదాని భవిష్యత్‌పై తీవ్రమైన ప్రశ్నలు లేవనెత్తుతున్నది.
చాబహార్ భారత్‌కు దగ్గరగా ఉన్న ఇరాన్ పోర్టు మాత్రమే కాదు.. అద్భుతమైన సముద్ర నౌకాశ్రయం కూడా. 2018లో ప్రభుత్వ యాజమాన్యంలోని ఇండియా పోర్ట్స్ గ్లోబల్ లిమిటెడ్ ద్వారా చాబహార్‌లోని షాహిద్ బెహెష్టి టెర్మినల్‌ను భారతదేశం ఆపరేషనల్ నియంత్రణలోకి తీసుకుంది. అప్పటి నుంచి పాకిస్తాన్‌ను దాటవేసి, ఆఫ్ఘనిస్తాన్, పశ్చిమాసియాకు వాణిజ్య మార్గాలను పెంచేందుకు భారత్ వ్యూహంలో ఈ ఓడరేవు కీలక భాగంగా మారింది. ఒమన్ గల్ఫ్‌లో ఉన్న ఈ ఓడరేవు ప్రాంతీయ వాణిజ్యాన్ని సులభతరం చేయడమే కాకుండా.. ఆఫ్ఘనిస్తాన్‌కు మానవతా సహాయం అందించడానికి కీలకమైన మార్గంగా కూడా పనిచేస్తుంది. మినహాయింపు రద్దు చేయడం వల్ల చాబహార్ పోర్టుకు సంబంధించిన పెట్టుబడులు, పరికరాల సరఫరా, రైలు ప్రాజెక్టులు, ఆర్థిక లావాదేవీలు వంటి అన్ని కార్యకలాపాలపై అమెరికా ఆంక్షలు విధించవచ్చని నిపుణులు భావిస్తున్నారు. మౌలిక సదుపాయాల అభివృద్ధికి పరికరాలను తీసుకురావడం మరింత భారంతోపాటు సంక్లిష్టంగా మారుతుంది.
షిప్పింగ్, ఫైనాన్సింగ్ ఖర్చులు పెరగడం వల్ల భారతీయ కంపెనీలకు కాంట్రాక్టులు, వ్యాపారంపై ప్రత్యక్ష ప్రభావం చూపుతుంది. 2018లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన పదవీకాలంలో ఇరాన్‌పై కఠినమైన ఆంక్షలు విధించింది. ఆ సమయంలో ఆఫ్ఘనిస్తాన్‌కు ఆర్థిక, మానవతా సహాయం కోసం చాబహార్‌ను ఉపయోగించుకునేలా భారత్ మినహాయింపులు పొందింది. ఈ మినహాయింపు భారతదేశం పోర్టు అభివృద్ధిలో గణనీయంగా పెట్టుబడి పెట్టింది. 2024 మే 13న భారత్ పది సంవత్సరాల పాటు ఈ ఓడరేవును నిర్వహించేందుకు ఒప్పందంపై సంతకాలు చేసింది. ప్రాంతీయ స్థిరత్వాన్ని నిర్ధారించడంలో చాబహార్ ఓడరేవు కీలక పాత్ర పోషించింది. దాని అభివృద్ధితో ఇటీవలి సంవత్సరాల్లో కార్గో ట్రాఫిక్ బాగా పెరిగింది. ఎనిమిది మిలియన్ టన్నులకు పైగా కార్గో నిర్వహించారు. 2026 మధ్య నాటికి ఓడరేవు సామర్థ్యాన్ని 100,000 నుంచి 500,000 TEUలకు విస్తరించి ఇరాన్ రైల్వే నెట్‌వర్క్‌కు అనుసంధానించే ప్రణాళికలు.. పెరుగుతున్న ప్రాముఖ్యతను చెబుతున్నాయి.
హార్ముజ్ జలసంధికి ఈ ఓడరేవు సమీపంలోనే ఉండడం కూడా ప్రాంతీయ స్థిరత్వాన్ని నిర్ధారించడానికి కీలకమైనదిగా పరిగణిస్తున్నారు. ట్రంప్ తొలి పదవీకాలంలో విధించిన ఆంక్షలను పాటించడానికి ఇరాన్ నుంచి అన్ని చమురు దిగుమతులను నిలిపివేయడం ద్వారా భారత్ ఒకప్పుడు తన ప్రయోజనాలను పణంగా పెట్టిందని దౌత్య నిపుణుడు బ్రహ్మ చెల్లానీ తెలిపారు. ఇది చైనాకు ఊహించని ప్రయోజనాలను అందించిందని.. ఇరాన్ చౌకైన ముడి చమురు (ప్రపంచంలోనే చౌకైనది) ఏకైక కొనుగోలుదారుగా మారింది. చైనా ఇంధన భద్రతను బలోపేతమైంది. ప్రస్తుతం చాబహార్ పోర్ట్‌పై మినహాయింపులను రద్దు చేయడం వల్ల భారతదేశ ప్రయోజనాలకు తీవ్రమైన నష్టం జరుగనున్నది. చైనా రోడ్ అండ్ బెల్ట్ చొరవలో భాగమైన పాకిస్తాన్ గ్వాదర్ ఓడరేవుకు చాబహార్ ఒక వ్యూహాత్మక ప్రతిఘటన. అయితే, ట్రంప్ విధానాలు సముద్ర రంగంలో చైనా ఆధిపత్యాన్ని అరికట్టడానికి ప్రయత్నిస్తున్నందుకు భారత్‌కు శిక్షగా మారనున్నాయి. ట్రంప్ ఒత్తిడి ఎప్పుడూ బీజింగ్‌కు గరిష్ట లాభం జరుగుతుండగా.. భారత్ మూల్యం చెల్లించుకోవాల్సిన పరిస్థితి ఎదురవుతున్నది.