న్యూఢిల్లీ, ఏప్రిల్ 7: శబరిమల ఆలయంలోకి 10-50 ఏండ్ల వయసు మహిళల ప్రవేశంపై ఆంక్షల అంశం మత విశ్వాసం, మత శాఖల స్వయంప్రతిపత్తి పరిధిలోకి వస్తుందని కేంద్రం స్పష్టం చేసింది. ఇది న్యాయ సమీక్ష పరిధికి అతీతమైనదని మంగళవారం సుప్రీం కోర్టు లో వాదించింది. శబరిమలలో 10-50 ఏండ్ల లోపు మహిళలపై చాలా ఏండ్లుగా కొనసాగుతున్న ఆలయ ప్రవేశ నిషేధాన్ని ఎత్తివేస్తూ 2018లో ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం తీర్పు చెప్పింది. దానిని సవాల్ చేస్తూ 80 పిటిషన్లు దాఖలు కాగా, దానిపై తొమ్మిది మంది సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం విచారణ ప్రారంభించింది.
ఒక ప్రార్థనా మందిరంలోకి ఎవరు ప్రవేశించాలో నిర్ణయించే ఆంక్షలు లింగ వివక్ష కిందికి రాదని, అది దేవతా మూర్తి స్వభావం, తరతరాల సంప్రదాయాలు, విశ్వాసాలతో ముడిపడి ఉన్న అంశమని కేంద్రం స్పష్టం చేసింది. 10-50 సంవత్సరాల వయస్సు గల మహిళలకు ఆలయ ప్రవేశం నుంచి మినహాయించడం అనేది రాజ్యాంగంలోని ఆర్టికల్ 17ను ఉల్లంఘించే అంటరానితనం అని 2018లో కోర్టు ఇచ్చిన తీర్పుపై తమకు అభ్యంతరం ఉందని ప్రభుత్వం తరపున వాదిస్తున్న తుషార్ మెహతా పేర్కొన్నారు. ఒక మహిళను నెలలో మూడు రోజుల పాటు అంటరాని దానిగా పరిగణించి , నాలుగో రోజు ఆమెను అంటరాని దానిగా పరిగణించడం మానివేయలేమని జస్టిస్ నాగరత్న అన్నారు. ప్రతి నెలా మూడు రోజుల పాటు అంటరానితనం అన్నది ఉండరాదని ఒక మహిళగా తాను చెబుతున్నానని ఆమె అన్నారు. దీనిపై తుషార్ స్పందిస్తూ మహిళల నెలసరితో శబరిమలకు సంబంధం లేదని, ఇక్కడ కేవలం వయసు అంశాన్ని మాత్రమే పరిగణనలోకి తీసుకుంటున్నట్టు చెప్పారు.