న్యూఢిల్లీ : పెగాసస్ స్పైవేర్ వ్యవహారంలో కేంద్ర ప్రభుత్వం సోమవారం సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది. ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలను పరిశీలించేందుకు నిపుణుల కమిటీ ఏర్పాటు చేస్తామని అఫిడవిట్లో సర్వోన్నత న్యాయస్ధానానికి నివేదించింది. ప్రముఖ పాత్రికేయుడు ఎన్ రామ్‌తో పాటు ఎడిటర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియా, యశ్వంత్ సిన్హా తదితరులు దాఖలు చేసిన పిటిషన్లపై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. పెగాసస్ స్పైవేర్‌తో కేంద్ర ప్రభుత్వం జర్నలిస్టులు, రాజకీయ నేతలు, సామాజిక కార్యకర్తలు కోర్టు సిబ్బంది ఫోన్లను హ్యాక్ చేస్తోందని పిటిషనర్లు పలు ఆరోపణలు చేశారు.
ఈ వ్యవహారంపై స్వతంత్ర దర్యాప్తు చేపట్టాలని పిటిషనర్లు డిమాండ్ చేశారు. జర్నలిస్టులు, రాజకీయనేతల ఫోన్లను ట్యాప్ చేసేందుకు మిలటరీ గ్రేడ్ స్పైవేర్‌ను వాడుతున్నట్టు పిటిషనర్లు చేసిన ఆరోపణలను కోర్టుకు సమర్పించిన రెండు పేజీలతో కూడిన అఫిడవిట్లో కేంద్ర ప్రభుత్వం తోసిపుచ్చింది. వార్తా పత్రికల కథనాల ఆధారంగా ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు ధాఖలు చేయలేరని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా అన్నారు.
పెగాసస్ స్పైవేర్ ద్వారా భారత్‌లో ఇద్దరు మంత్రులు, 40 మందికి పైగా జర్నలిస్టులు, ముగ్గురు విపక్ష నేతలు, ఓ సిట్టింగ్ న్యాయమూర్తి సహా పలువురు వ్యాపారవేత్తలు, సామాజిక కార్యకర్తలతో కూడిన 300 మందికి పైగా వ్యక్తుల ఫోన్లను హ్యాకింగ్ కోసం టార్గెట్ చేశారని అంతర్జాతీయ మీడియా కన్సార్షియం ఇటీవల వెలుగులోకి తేవడం కలకలం రేపింది.