న్యూఢిల్ల్లీ, ఆగస్టు 16 : శాసనసభ ఆమోదించిన బిల్లులను ఆమోదించడానికి గవర్నర్లకు సుప్రీంకోర్టు నిర్దిష్ట కాల వ్యవధిని విధించడాన్ని కేంద్ర ప్రభుత్వం గట్టిగా వ్యతిరేకించింది. బిల్లులపై నిర్ణయం తీసుకోవడానికి గవర్నర్లకు నెల రోజులు, రాష్ట్రపతికి మూడు నెలల గడువు విధిస్తూ జస్టిస్ జేబీ పార్దీవాలా, జస్టిస్ ఆర్ మహదేవన్‌తో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం ఏప్రిల్ 12న తీర్పు ఇచ్చింది. అటువంటి గడువులు విధించడం తనకు లేని అధికారాలను ప్రభుత్వం నుంచి హరించడమేనని ప్రభుత్వం సుప్రీంకోర్టుకు సమర్పించిన ఓ వాంగ్మూలంలో పేర్కొంది. ఒకరి అధికారాలను మరొకరు లాక్కోవడం వల్ల రాజ్యాంగ కల్లోలానికి దారి తీయగలదని ప్రభుత్వం హెచ్చరించింది. రాజ్యాంగంలోని 142 అధికరణ కింద తనకు ఉన్న విచక్షణాధికారాల కింద కూడా సుప్రీంకోర్టు రాజ్యాంగాన్ని సవరించలేదని ప్రభుత్వం తెలిపింది. రాజ్యాంగంలో తనకు లేని అధికారాలను సుప్రీంకోర్టు ఉపయోగించుకోలేదని ప్రభుత్వం స్పష్టం చేసింది.
బిల్లులకు ఆమోదం తెలిపే ప్రక్రియ అమలులో కొన్ని పరిమిత సమస్యలు ఉండవచ్చని, వీటి ఆధారంగా ఉన్నతమైన గవర్నర్ పదవిని తగ్గించడం తగదని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా తన అఫిడవిట్లో పేర్కొన్నారు. గవర్నర్, రాష్ట్రపతి కార్యాలయాలు రాజకీయాలకు అతీతమని, ప్రజాస్వామిక పాలనకు అత్యున్నతమైన మార్గదర్శనంగా అవి ప్రతిబింబిస్తాయని మెహతా తెలిపారు. ఎక్కడైనా లోపాలు ఉంటే వాటిని రాజకీయ, రాజ్యాంగ యంత్రాంగాల ద్వారా పరిష్కరించుకోవాలే తప్ప అవాంఛనీయ న్యాయవ్యవస్థ జోక్యం ద్వారా మాత్రం కాదని ప్రభుత్వం తన అఫిడవిట్లో స్పష్టం చేసింది. రాజ్యాంగంలోని 200 అధికరణ కింద రాష్ట్ర శాసనసభ ఆమోదించి తనకు పంపిన బిల్లులకు గవర్నర్ ఆమోదం తెలపవచ్చు లేదా వాటిని రాష్ట్రపతి ఆమోదం కోసం పెండింగ్‌లో పెట్టవచ్చు. తిరిగి ఆమోదం కోసం వాటిని శాసనసభకు తిప్పిపంపవచ్చు కూడా. రెండోసారి ఆమోదం పొంది వచ్చిన బిల్లులకు గవర్నర్ ఆమోదం తెలపకుండా ఆపలేరు. రాజ్యాంగ విరుద్ధంగా ఉన్న లేక జాతీయ ప్రాధాన్యత కలిగి ఉన్న బిల్లులను రాష్ట్రపతి ఆమోదం కోసం నివేదించవచ్చు.