రాష్ట్ర ప్రభుత్వం తరఫున సహకారం
కోర్టుల నిర్వహణకు కేంద్రం నిధులివ్వాలి
న్యాయ సదస్సులో మంత్రి ఇంద్రకరణ్
హైదరాబాద్, ఏప్రిల్ 30 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర న్యాయవ్యవస్థను మరింత బలోపేతం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున పూర్తి సహకారం అందిస్తున్నామని తెలంగాణ న్యాయశాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి తెలిపారు. కోర్టు భవనాల నిర్మాణం, న్యాయ వ్యవస్థలో సాంకేతికత వినియోగం, మౌలిక వసతులను మెరుగుపరచడం, న్యాయమూర్తులు, అధికారులు, సిబ్బంది నియామకం ఇలా ప్రజలకు సత్వర న్యాయం అందించేందుకు అవసరమైన అన్ని చర్యలను ప్రభుత్వం తీసుకుంటుందని అన్నారు. హైకోర్టు ప్రతిపాదనల మేరకు తక్షణమే నిధులు సమకూరుస్తున్నామని వివరించారు. శనివారం ఢిల్లీ విజ్ఞాన్ భవన్లో నిర్వహించిన న్యాయసదస్సులో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరపున న్యాయశాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తుల సంఖ్యను 24 నుంచి 42కు పెంచేందుకు కృషి చేసిన సీజేఐ జస్టిస్ రమణ, కేంద్ర న్యాయశాఖకు తెలంగాణ ప్రభుత్వం, సీఎం కేసీఆర్ తరపున మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. ప్రస్తుతం 29 మంది న్యాయమూర్తులు తెలంగాణ హైకోర్టులో విధులు నిర్వహిస్తున్నారంటే సీజేఐ ప్రత్యేక కృషి ఫలితమేనని చెప్పారు.
సీజేఐ చొరవతోనే అంతర్జాతీయ ప్రమాణాలతో హైదరాబాద్‌లో ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ అండ్ మీడియేషన్ సెంటర్ ఏర్పాటైందన్నారు. ఇందుకోసం అవసరమైన మౌలిక వసతులు, స్థలం, నిధులను తెలంగాణ ప్రభుత్వం కేటాయించిందని వెల్లడించారు. తెలంగాణ ప్రభుత్వం కొత్తగా 47 కోర్టులను ఏర్పాటు చేయడంతో పాటు వివిధ క్యాటగిరీల్లో 2,542 పోస్టులను మంజూరు చేసిందన్నారు. కొత్త కోర్టుల ఏర్పాటుపై హైకోర్టు సిఫార్సులకు అనుగుణంగా ఎప్పటికప్పుడు నిధులు కేటాయిస్తున్నామని తెలిపారు. దేశంలో న్యాయస్థానాల నిర్వహణ సజావుగా సాగేందుకు, న్యాయ వ్యవస్థలపై ఆర్థిక భారం తగ్గించేందుకు కేంద్రప్రభుత్వం ఆర్థిక సహాయం అందించాలని కోరారు.