Waqf Board | న్యూఢిల్లీ, ఆగస్టు 4: ఆస్తులపై వక్ఫ్‌బోర్డు అధికారాలకు కత్తెర వేయడానికి వక్ఫ్ చట్టంలో సవరణలు చేయడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. ఈ మేరకు 40 సవరణలకు క్యాబినెట్ శుక్రవారం ఆమోదం తెలిపిందని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఏదైనా ఆస్తిని ‘వక్ఫ్ ఆస్తి’ అని నిర్ధారించే అధికారం వక్ఫ్ బోర్డ్ యాజమాన్యానికి ఇకపై ఉండదనేది వీటిలో ముఖ్యమైన సవరణ. వక్ఫ్ బోర్డు తన ఆస్తులుగా పేర్కొనే అన్నింటిని తప్పనిసరిగా తనిఖీ చేస్తారు. కేంద్ర వక్ఫ్ మండలి, రాష్ర్టాల బోర్డుల్లో మహిళలకు ప్రాతినిధ్యం కల్పించాలన్న ప్రతిపాదన కూడా తాజా సవరణల్లో ఉంది. 2013లో యూపీఏ సర్కారు ఒరిజినల్ వక్ఫ్ చట్టం-1995కు సవరణలు చేయడం ద్వారా వక్ఫ్ కేంద్ర, రాష్ట్ర బోర్డులకు ఉన్న అధికారాలను బలపరిచింది.
వక్ఫ్ బోర్డ్‌ల చట్టబద్ధమైన హోదా, అధికారాల్లో జోక్యం చేసుకుంటే సహించబోమని ‘ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డ్’ (ఏఐఎంపీఎల్బీ) పేర్కొంది. ముస్లింలకు సంబంధించి వారికి ఏమీ ఇవ్వకుండా, అన్నింటినీ లాక్కునే విధంగా మోదీ నిర్ణయాలు, చర్యలు ఉన్నాయంటూ ‘ఏఐఎంపీఎల్బీ’ ప్రతినిధి ఇల్లియాస్ ఆరోపించారు.