న్యూఢిల్లీ, డిసెంబర్ 3: సర్వత్రా విమర్శలు వెల్లువెత్తిన నేపథ్యంలో వెనక్కు తగ్గిన కేంద్ర ప్రభుత్వం స్మార్ట్‌ఫోన్ తయారీదారులు సంచార్ సాథీ యాప్‌ను ముందుగానే మొబైల్ ఫోన్లలో తప్పనిసరిగా ఇన్స్టలేషన్ చేయాలన్న నిబంధనను తొలగించింది. కేంద్ర కమ్యూనికేషన్ల శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా బుధవారం లోక్‌ససభలో జరిగిన చర్చలో మాట్లాడుతూ సంచార్ సాథీ యాప్‌నకు సంబంధించిన నిబంధనలను సవరించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలిపారు.
సంచార్ సాథీ యాప్‌తో మొబైల్ ఫోన్లపై నిఘా పెట్టడం అసాధ్యమని, ప్రభుత్వం అలాంటి పని ఎన్నడూ చేయబోదని ఆయన స్పష్టం చేశారు. ఈ యాప్‌ను వినియోగించుకోవాలా లేక డిలీట్ చేయాలా అన్న విషయాన్ని ఎంపిక చేసుకునే హక్కు ప్రతి పౌరుడికీ ఎప్పటికీ ఉంటుందని, ఈ యాప్ నిబంధనలను సవరించడానికి ప్రభుత్వం సుముఖంగా ఉందని సింధియా తెలిపారు.