సీఎం సోరెన్ లక్ష్యంగా ఈడీ సోదాలు
సన్నిహితుల ఇండ్లలో తనిఖీలు
అధికారం కోసం కేంద్రం కుట్రలు
రాంచీ, జూలై 8: కేంద్ర దర్యాప్తు సంస్థలైన సీబీఐ, ఈడీలను కేంద్రం పావులుగా వాడుకుంటూ విపక్ష పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్ర ప్రభుత్వాలను కూల్చుతున్నదని విమర్శలు వస్తున్నా మోదీ సర్కారు మాత్రం పంథా మార్చట్లేదు. మహారాష్ట్రలో పాగా వేశామని, త్వరలో జార్ఖండ్ తదితర రాష్ర్టాల్లోనూ అధికారాన్ని దక్కించుకుంటామని ఇటీవల పలువురు బీజేపీ నేతల వ్యాఖ్యలు నిజమయ్యేలా ఉంది. జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ సన్నిహితులు, ఆయనతో సంబంధాలు ఉన్న వ్యక్తులే లక్ష్యంగా శుక్రవారం ఈడీ సోదాలు జరిపింది. జార్ఖండ్‌లోని 18 ప్రాంతాల్లో ఈ సోదాలు జరిగాయి. సోరెన్ మిత్రుడు పంకజ్ మిశ్రా, పలువురు వ్యక్తుల నివాసాలు, కార్యాలయాల్లో ఈ సోదాలు చేపట్టారు.
టోల్ ప్లాజాల టెండర్లలో అక్రమాలు చోటుచేసుకున్నాయని, ఇందుకు సంబంధించి మనీ ల్యాండరింగ్ కేసులో సోదాలు జరిపామని ఈడీ అధికారులు పేర్కొంటున్నా అసలు విషయం మాత్రం టార్గెట్ సోరెన్ సర్కారు అన్నట్టు అర్థమవుతున్నది. ప్రస్తుతం జార్ఖండ్‌లో జార్ఖండ్ ముక్తి మోర్చా, కాంగ్రెస్ సంకీర్ణ ప్రభుత్వం అధికారంలో ఉన్నది. జేఎంఎం నాయకుడైన హేమంత్ సోరెన్ సీఎంగా విధులు నిర్వర్తిస్తున్నారు. ఈ నేపథ్యంలో జార్ఖండ్‌పై బీజేపీ ఎప్పటి నుంచో కన్నేసిందని, ఇటీవల ఆపరేషన్ మహారాష్ట్ర సక్సెస్ కావడంతో దూకుడు పెంచిందని, అధికారాన్ని దక్కించుకోవడానికి పావులు కదుపుతున్నదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.