Telegram : పైరేటెడ్ మూవీస్, ఓటీటీ కంటెంట్ సహా అనుమతి లేని ఆడియో, విజువల్ కంటెంట్‌ను తొలగించాలని సోషల్ మెసేజింగ్ యాప్ టెలిగ్రాంను కేంద్రం ఆదేశించింది. ఈ విషయంలో వెంటనే చర్యలు ప్రారంభించాలని సూచించింది. ఈ మేరకు కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ శనివారం నోటీసులు ఇచ్చింది. నిబంధనలు ఉల్లంఘిస్తూ, ఇలాంటి కంటెంట్ ప్రచారం చేస్తున్న అంశంపై 15 రోజుల్లోగా సమాధానం ఇవ్వాలని సూచిస్తూ టెలిగ్రాంకు కేంద్రం నోటీసులు జారీ చేసింది.
ఈ విషయంలో ఎలాంటి చర్యలు తీసుకున్నారో తెలుపుతూ ‘యాక్షన్ టేకెన్ రిపోర్ట్ (ఏటీఆర్)’ ఇవ్వాలని ఆదేశించింది. పైరేటెడ్ మూవీస్, ఓటీటీ కంటెంట్‌ను ప్రసారం చేస్తున్న ఛానెల్స్‌పై నిషేధం విధించాలని సూచించింది. అలాగే, అలాంటి కంటెంట్‌ను, చానెల్స్‌ను గుర్తించేందుకు, రిపోర్ట్ చేసేందుకు తగిన వ్యవస్థ ఏర్పాటు చేయాలని కూడా ఆదేశించింది. సినీ ఇండస్ట్రీ సంక్షేమంతోపాటు ప్రసారకర్తలు, నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు, ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ హక్కులు కాపాడేందుకు, క్రియేటర్లకు దక్కాల్సిన ఆర్థిక ప్రయోజనాల్ని రక్షించేందుకు కేంద్రం ఈ నోటీసులు జారీ చేసింది. టెలిగ్రాం ప్లాట్‌ఫాంపై షేర్ అయ్యే అక్రమ, కాపీరైట్ కంటెంట్‌ను తొలగించే వ్యవస్థన పటిష్టం చేయాలని కేంద్రం తన నోటీసుల్లో పేర్కొంది. పదేపదే నిబంధనలు ఉల్లంఘించే ఉల్లంఘనదారులు, ఛానెల్స్, గ్రూప్స్, బాట్స్, యూజర్ అకౌంట్స్, అడ్మినిస్ట్రేటర్స్, ఇతర సంస్థలపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించింది.
నిర్మాతలు, ఓటీటీ ప్లాట్‌ఫామ్స్, చట్టబద్ధం సంస్థలు టెలిగ్రాంలో కాపీరైట్ అంశాలపై చర్చించేందుకు, ఫిర్యాదు చేసేందుకు తగిన గ్రీవెన్స్ వ్యవస్థను కూడా ఏర్పాటు చేయాలని సూచించింది. కాపీరైట్ కంటెంట్ ప్రసారం చేసే అంశంలో మెసేజింగ్ ప్లాట్‌ఫాంలకు జవాబుదారీ తనం ఉండాలని, గతంలో ఇలా నిబంధనలు ఉల్లంఘించిన 3,000కు పైగా టెలిగ్రాం ఛానెళ్లను తొలగించినట్లు కేంద్రం తెలిపింది. కొంతకాలంగా టెలిగ్రాంపై కేంద్రం ప్రత్యేక దృష్టి సారించింది. లీకైన పేపర్లు సహా పైరేటెడ్ కంటెంట్ ఎక్కువగా టెలిగ్రాం ద్వారానే షేర్ అవుతున్నట్లు గుర్తించింది. దీంతో నోటీసులు జారీ చేస్తోంది.