Coaching Centres | న్యూఢిల్లీ: పోటీ పరీక్షలకు శిక్షణనిచ్చే కోచింగ్ సెంటర్లు తప్పుడు ప్రకటనలు ఇవ్వకుండా నియంత్రించేందుకు సెంట్రల్ కన్జూమర్ ప్రొటెక్షన్ అథారిటీ (సీసీపీఏ) కొత్త మార్గదర్శకాలను జారీ చేసింది. పలు కోచింగ్ సెంటర్లు తప్పుడు ప్రకటనలపై నేషనల్ కన్జూమర్ హెల్ప్లైన్కు పెద్ద ఎత్తున ఫిర్యాదులు అందుతున్న నేపథ్యంలో బుధవారం ఈ మార్గదర్శకాలను ప్రకటించింది.
వీటి ప్రకారం ఇక మీద కోచింగ్ సెంటర్లు ‘100 శాతం జాబ్ గ్యారెంటీ’ వంటి ప్రకటనలు ఇవ్వడానికి వీల్లేదు. కోచింగ్ సెంటర్లు ఉద్దేశపూర్వకంగా విద్యార్థుల వద్ద కొంత సమాచారాన్ని దాస్తున్నందున ఈ మార్గదర్శకాలను జారీ చేసినట్టు వినియోగదారుల వ్యవహారాల కార్యదర్శి నిధి ఖారే తెలిపారు.
కోచింగ్కు సంబంధించి పలు నిర్వచనాలను సైతం మార్గదర్శకాల్లో సీసీపీఏ పొందుపరిచింది. మార్గదర్శకాలను ఉల్లంఘించిన కోచింగ్ సెంటర్లపై కన్జూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ – 2019 కింద జరిమానా విధించడం, లైసెన్సులు రద్దు చేయడం, కోచింగ్ సెంటర్లు మూసివేయడం వంటి చర్యలు తీసుకోనున్నారు.
కోచింగ్: విద్యార్థులకు విద్యా సంబంధ మార్గదర్శకత్వం చేయడం, సూచనలు ఇవ్వడం. క్రీడలు, కళలు వంటి విద్యతో సంబంధం లేని అంశాలకు వర్తించదు.
కోచింగ్ సెంటర్: 50 మంది కంటే ఎక్కువ విద్యార్థులు కలిగి ఉండే సంస్థ.
ఎండార్సర్: కోచింగ్ సెంటర్లకు ప్రచారం చేసే వ్యక్తులు.