న్యూఢిల్లీ : ఎల్ నినో ప్రభావం కారణంగా దేశంలో సాధారణం కంటే తక్కువగా వర్షాలు కురిసే 315 జిల్లాలను కేంద్ర వ్యవసాయ శాఖ గుర్తించింది. ఈ జిల్లాలు కలిగిన ఆయా రాష్ర్టాలు తమ అత్యవసర ప్రణాళికలను అమలు చేయాలని ఆదేశించింది. ఈ 315 జిల్లాల్లో 25 శాతం కంటే తక్కువ సాగునీటి వసతి కలిగిన 111 జిల్లాలను అత్యంత ప్రమాదకమైన కేటగిరీగా గుర్తించారు. 25 నుంచి 50 శాతంలోపు సాగునీటి వసతి ఉన్న మరో 76 జిల్లాలను మధ్యస్థ ప్రమాదకర కేటగిరీలో చేర్చగా, 50 శాతం కంటే ఎక్కువ సాగునీటి సౌకర్యం ఉన్న 128 జిల్లాలను సాపేక్షంగా తక్కువ ముప్పు ఉన్న ప్రాంతాలుగా పరిగణించారు.
అత్యంత ప్రమాదకర స్థితిలో ఉన్న జిల్లాలు ఎక్కువగా మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌లలో కేంద్రీకృతమై ఉన్నాయి. మిగిలిన జిల్లాలు మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, గుజరాత్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, కర్ణాటక, బీహార్, జార్ఖండ్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఒడిశా రాష్ర్టాల్లో విస్తరించి ఉన్నాయి. బలహీనమైన రుతుపవనాల ప్రభావాన్ని తట్టుకునేందుకు పప్పు ధాన్యాలు, చిరుధాన్యాలు, నూనె గింజల సాగువైపు రైతులను ప్రోత్సహించాలని కేంద్రం రాష్ర్టాలకు సూచించింది. పంటల వైవిధ్యం, తేమ సంరక్షణ, సమర్థవంతమైన నీటి యాజమాన్యం వంటి వ్యూహాలను అనుసరించాలని తెలిపింది.
చెరువుల మరమ్మతులు, చెక్ డ్యామ్‌ల పునరుద్ధరణ, కాలువల్లో పూడికతీత, నీటి సంరక్షణ నిర్మాణాల విస్తరణ ద్వారా నీటి నిల్వ సామర్థ్యాన్ని బలోపేతం చేయాలని రాష్ర్టాలను ఆదేశించింది. మరోవైపు 2026 ద్వితీయార్థ్థంలో ఎల్ నినో తీవ్ర రూపం దాల్చే అవకాశం ఉందని ఐక్యరాజ్యసమితి వాతావరణ సంస్థ హెచ్చరించింది. ‘సౌత్ ఏషియన్ ైక్లెమేట్ అవుట్ లుక్ ఫోరం’ అంచనాల ప్రకారం భారతదేశంలో దీర్ఘకాలిక సగటు వర్షపాతంలో కేవలం 90 శాతం మాత్రమే కురిసే అవకాశం ఉంది. తీవ్రమైన ఉష్ణోగ్రతలు, నీటి ఎద్దడి కారణంగా సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఎల్ నినో వల్ల అనావృష్టి ఏర్పడి ఆహార ద్రవ్యోల్బణం పెరిగిపోయే ప్రమాదం ఉందని హెచ్చరించింది.