(స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్, ఏప్రిల్ 15 (నమస్తే తెలంగాణ): నియోజకవర్గాల పునర్విభజనపై కేంద్రం వైఖరి విచిత్రంగా ఉన్నది. గతంలో చెప్పిన మాటలకు.. ఇప్పుడు చేస్తున్న చర్యలకు ఎక్కడా పొంతన కుదరడం లేదు. 2026-27 తర్వాత జనగణనను చేపట్టి, ఆ వివరాలతో నియోజకవర్గాల పునర్విభజనను 2031నాటికి పూర్తి చేస్తామని గతంలో కేంద్రం తెలిపింది. పెరిగిన నియోజకవర్గాలతో 2034లో లోక్సభ ఎన్నికలు నిర్వహిస్తామన్నది.
అయితే, ఇప్పుడు ఉన్నట్టుండి 2011 జనగణన డాటా ప్రకారమే డీలిమిటేషన్ చేస్తామని ప్రకటించింది. ఇక, పార్లమెంట్లో రాష్ర్టాలకు ఇప్పుడు ఉన్న ప్రాతినిధ్యంపై ఎలాంటి ప్రభావం పడకుండా డీలిమిటేషన్ ప్రక్రియను చేపడుతామని మొన్న కేంద్రం ప్రకటించింది. ఇందులో భాగంగానే ఇప్పుడు ఉన్న లోక్సభ సీట్లను 50 శాతం మేర పెంచనున్నట్టు పేర్కొన్నది. అలా మొత్తం లోక్సభ సీట్లు 816కు చేరుతాయని లీకులు కూడా ఇచ్చింది. తాజా బిల్లులో మాత్రం లోక్సభ సీట్లు గరిష్ఠంగా 850గా పేర్కొన్నది. మరోవైపు, అన్ని రాజకీయ పార్టీలను సంప్రదించి డ్రాఫ్ట్ బిల్లు తీసుకొస్తామంటూ మొన్నటివరకూ చెప్పిన కేంద్రం.. ఏ పక్షాన్నీ సంప్రదించకుండా హడావుడిగా ఎంపీలకు బిల్లు ప్రతులను పంచింది.
ప్రజాభిప్రాయ సేకరణను తీసుకొంటామన్న మాట కూడా నిలబెట్టుకోకుండా గురువారం జరుగనున్న పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో బిల్లును ప్రవేశపెట్టడానికి తయారయ్యింది. మొత్తంగా తమ పార్టీ ఉనికి ప్రశ్నార్థకంగా ఉన్న దక్షిణాది రాష్ర్టాలను దెబ్బతీస్తూ.. తాము అధికారంలో ఉన్న ఉత్తరాది రాష్ర్టాలకు లబ్ధి చేకూర్చడానికే కేంద్రం హడావుడిగా ఈ బిల్లును తీసుకొస్తున్నదని విమర్శకులు అంటున్నారు.