న్యూఢిల్లీ : ఎన్సీఈఆర్టీ ఇటీవల ప్రచురించిన వివాదాస్పద న్యాయ వ్యవస్థ చాప్టర్‌ను సవరించడానికి కేంద్రం ముగ్గురు నిపుణులతో ఒక కమిటీని ఏర్పాటు చేసింది. సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు ఎనిమిదో తరగతి సాంఘిక శాస్త్రం పాఠ్య పుస్తక విషయంలో ఈ చర్య తీసుకుంది. కమిటీలో మాజీ అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్, సుప్రీం కోర్ట్ మాజీ జడ్జి జస్టిస్ ఇందూ మల్హోత్రా, జస్టిస్ అనిరుద్ధ బోస్, ఒక ఉప కులపతి సభ్యులుగా ఉంటారు.
మరోవైపు వివాదాస్పద చాప్టర్లోని ఒక వ్యాఖ్యకు వ్యతిరేకంగా దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని సుప్రీం కోర్టు బెంచ్ కొట్టేసింది. ఆ వ్యాఖ్య న్యాయ నిర్ణయాలపై ఒక ‘దృక్కోణాన్ని’ మాత్రమే ప్రతిబింబిస్తున్నదని.. దానికి న్యాయస్థానం జోక్యం అవసరం లేదని కోర్టు వ్యాఖ్యానించింది. కోర్టు తీర్పులపై ప్రతి ఒక్కరికీ ఒక్కో దృక్కోణం కలిగి ఉండే హక్కు ఉందని సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ తెలిపారు.