న్యూఢిల్లీ: భారత్, పాక్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో 24 ఎయిర్పోర్టుల మూసివేతను కేంద్రం పొడిగించింది. (closure of airports) మే 14 వరకు మూసివేత అమలులో ఉంటుందని శుక్రవారం పేర్కొంది. చండీగఢ్, అమృత్సర్, లూధియానా, భుంటార్, కిషన్గఢ్, పాటియాలా, సిమ్లా, జైసల్మేర్, పఠాన్కోట్, శ్రీనగర్, జమ్మూ, బికనీర్, లేహ్, పోర్బందర్, ఇతర నగరాల్లోని విమానాశ్రయాలు మే 14 వరకు మూసివేసినట్లు పౌర విమానయాన మంత్రిత్వ శాఖ తెలిపింది. తొలుత మే 10 వరకు ఈ ఎయిర్పోర్టులను మూసివేస్తున్నట్లు ప్రకటించింది. అయితే ఆ గడువును మే 14 వరకు శుక్రవారం పొడిగించింది.
కాగా, భద్రతా కారణాల దృష్ట్యా 24 ఎయిర్పోర్టులను మూసివేసిన నేపథ్యంలో విమానయాన సంస్థలు పలు సూచనలు జారీ చేశాయి. విమానాశ్రయాల మూసివేత, భద్రతా ప్రోటోకాల్స్ గురించి ఎప్పటికప్పుడు తెలుసుకోవాలని ప్రయాణికులను కోరాయి. శ్రీనగర్, జమ్మూ, అమృత్సర్, లేహ్, చండీగఢ్, ధర్మశాల, బికనీర్, జోధ్పూర్, కిషన్గఢ్, రాజ్కోట్లకు అన్ని విమానాలను రద్దు చేసినట్లు ఇండిగో, ఎయిర్ ఇండియా ప్రకటించింది.
మరోవైపు భద్రతా ప్రోటోకాల్స్ వల్ల ఢిల్లీ విమానాశ్రయంలో విమాన సేవలపై ప్రభావం పడిందని ఎయిర్పోర్ట్ అధికారులు తెలిపారు. శుక్రవారం ఉదయం 5 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల మధ్య మొత్తం 60కు పైగా దేశీయ విమానాల రాకపోకలు, 4కు పైగా అంతర్జాతీయ సర్వీసులను రద్దు చేసినట్లు పేర్కొన్నారు.