న్యూఢిల్లీ : వక్ఫ్ సవరణ చట్టం, 2025 భారత రాజ్యాంగ పునాదులపై దృఢంగా నిలిచిందని కేంద్ర ప్రభుత్వం గురువారం సుప్రీంకోర్టుకు సమర్పించిన అఫిడవిట్లో తెలిపింది. న్యాయస్థానాలను ఆశ్రయించే హక్కు నిరాకరణకు గురికాకుండా ఈ చట్టంలోని నిబంధనలు భరోసానిస్తున్నాయని చెప్పింది. ఈ సవరణల వల్ల న్యాయపరమైన జవాబుదారీతనం, పారదర్శకత, నిష్పాక్షికత వస్తాయని చెప్పింది. ఇవన్నీ రాజ్యాంగ విలువలు, ప్రజా ప్రయోజనాలకు అనుగుణంగానే ఉన్నట్లు తెలిపింది. ఈ చట్టాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై స్పందిస్తూ అఫిడవిట్‌ను సమర్పించింది.
వక్ఫ్ బై యూజర్ ఆస్తులు ఈ చట్ట సవరణలు అమల్లోకి రావడానికి పూర్వం రిజిస్ట్రేషన్ చేయించకపోతే, ఆ ఆస్తుల పరిస్థితి ఏమిటి? అనే ప్రశ్నకు కేంద్రం స్పందిస్తూ, 1923 నుంచి రిజిస్ట్రేషన్ తప్పనిసరి అయినప్పటికీ, అటువంటి రిజిస్ట్రేషన్‌కు ఎటువంటి దస్తావేజులపరమైన రుజువులు అక్కర్లేదని చెప్పింది. దస్తావేజులు లేని వక్ఫ్ బై యూజర్ సహా వక్ఫ్ ఆస్తులపై ఈ చట్టం ప్రభావం పడుతుందని ప్రచారం చేస్తున్నారని, ఇది తప్పు అని చెప్పింది. సెక్షన్ 3(1)(ఆర్)లోని ప్రొవిజో ప్రకారం ‘వక్ఫ్ బై యూజర్’గా రక్షణ పొందాలంటే, ఈ సవరణ కానీ, అంతకుముందు కానీ, ట్రస్ట్, ఒప్పందం లేదా ఏదైనా దస్తావేజు కావాలని గట్టిగా పట్టుబట్టడం లేదని చెప్పింది. ఈ ప్రొవిజో ప్రకారం రక్షణ పొందడానికి తప్పనిసరిగా కావలసినది, అటువంటి ‘వక్ఫ్ బై యూజర్’ను 2025 ఏప్రిల్ 8 నాటికి రిజిస్ట్రేషన్ చేయించి ఉండటమేనని తెలిపింది.
వక్ఫ్ బోర్డులను రాష్ర్టాల చట్టాల పరిధిలోని హిందూ ఎండోమెంట్స్‌కు సంబంధించిన కమిషనర్లు/బోర్డులతో పోల్చడం సరైనది కాదని కేంద్రం తెలిపింది. వక్ఫ్ స్వభావం ప్రత్యేకమైనదని, దానికి తగిన వైఖరిని అవలంబించవలసిన అవసరం ఉంటుందని చెప్పింది. మతపరమైనది కానటువంటి, దాతృత్వ ప్రయోజనాల కోసం కూడా వక్ఫ్‌ను ఉపయోగిస్తారని తెలిపింది. ముస్లిమేతరులు వక్ఫ్ బోర్డుల్లో ఉండవచ్చునని పేర్కొంది.