Gig workers : బ్లింకిట్, జెప్టో, స్విగ్గీ లాంటి ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్స్ 10 నిమిషాల్లో డెలివరీ ఇస్తామన్న హామీని తొలగించాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశించినట్లు తెలిసింది. కేంద్ర మంత్రి మనుసుక్ మాండవీయ ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్స్‌కు చెందిన ప్రతినిధులతో సమావేశమై తాజా ఆదేశాలు ఇచ్చినట్లు సమాచారం. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ.. డెలివరీ పార్ట్నర్స్ భద్రతకు ప్రాధాన్యం ఇవ్వాలని ఈ-కామర్స్ ప్రతినిధులకు సూచించినట్లు తెలిసింది.
కేంద్ర ప్రభుత్వ వర్గాలు వెల్లడించిన వివరాల ప్రకారం.. కేంద్ర మంత్రి మనుసుక్ మాండవీయ జొమాటో, స్విగ్గీ, బ్లింకిట్, జెప్టో సహా పలు అగ్రిగేటర్స్‌కు సంబంధించిన ప్రతినిధులతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో 10 నిమిషాల్లో డెలివరీ అంశంపై చర్చించారు. 10 నిమిషాల డెలివరీ ఆఫర్‌ను ఎత్తివేయాలని కోరారు.
మంత్రి సూచన మేరకు బ్లింకిట్ అప్పుడు తన టాగ్లైన్ను సవరించిందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం ఉన్న ‘10,000 ప్లస్ డెలివరీస్ ఇన్ 10 మినిట్స్’ ట్యాగ్‌లైన్‌ను ‘30,000 ప్లస్ ప్రోడక్ట్స్ డెలివర్డ్ ఎట్ యువర్ డోర్‌స్టెప్’ గా మార్చినట్లు వెల్లడించాయి. ఈ-కామర్స్ సంస్థలు ఇస్తున్న 10 నిమిషాల్లో డెలివరీ ప్రామిస్.. గిగ్ వర్కర్స్‌ను ప్రమాదానికి గురిచేస్తోందని ఇటీవల ఆందోళనలు వ్యక్తమయ్యాయి.
‘మా శ్రమకు తగిన చెల్లింపులు ఇవ్వాలి. సామాజిక భద్రతా ప్రయోజనాలు కల్పించాలి’ అని డిమాండ్ చేస్తూ గత డిసెంబర్ 25న గిగ్ వర్కర్స్ ఆందోళనకు దిగారు. తమ డిమాండ్లను నెరవేర్చకపోతే డిసెంబర్ 31న దేశవ్యాప్తంగా ధర్నాలు చేస్తామని హెచ్చరించారు. దాంతో దిగొచ్చిన ఈ-కామర్స్ సంస్థలు స్విగ్గీ, జొమాటో ఇన్సెంటివ్స్ పెంచాయి.